సారథి, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నందిగామ, నస్కల్, నిజాంపేట గ్రామాల పంచాయతీ సిబ్బంది, సఫాయి కార్మికుల వేతనాలు పెంచాలని పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రామయంపేట ఉమ్మడి మండలం సీఐటీయూ నాయకులు సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందని కానీ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం సరికాదన్నారు.
మినిమం బేసిక్ పే రూ.19వేలు, రూ.22,900, రూ.31,040 చెల్లించాలని ఉన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం జీవోనం.60ని విడుదల చేస్తూ వివిధ కేటగిరీలకు రూ.15,600, రూ.19,600, రూ.22,750గా నిర్ణయించిందని పేర్కొన్నారు. 16 నెలలుగా కరోనా విపత్తును ఎదుర్కొని ప్రజారోగ్యం కాపాడుతూ పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని విస్మరించడం బాధ్యతారాహిత్యమేనని అన్నారు. రెండేళ్ల క్రితం వారి వేతనాలను నామమాత్రంగా రూ.8500 పెంచారని, 2020 ఏప్రిల్, మే నెలలో ఇన్సెంటివ్ ఇచ్చి ఆ తర్వాత నిలిపివేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కారోబార్ కొండల్ రెడ్డి, రవి, బి.శ్రీరాములు, ఎల్లయ్య, జి.లక్ష్మి, నాగవ్వ, దేవుని రాజు, మైసయ్య కుమార్, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.