Breaking News

ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

సారథి న్యూస్, రామాయంపేట: బీసీల అదృష్టం.. మన నుదిటి గీతలో చేతి రాతల్లో లేదని.. మనం వేసే ఓట్లలోనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం మెదక్ ​జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహన్ని ఆవిష్కరించారు. మనిషిని మనిషిగా చూడాలని.. మనిషిగా గౌరవించాలని కలలు గన్న గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు. ఓట్లంటే తెల్లకాగితం.. కంప్యూటర్ బటన్ కాదు ఓట్లంటే సీఎం కుర్చీ, పీఎం కుర్చీ అన్నారు. మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకుండా ఉండాలంటే వ్యవస్థలో సమూల మార్పులు రావాలని కోరారు. బీసీ కులాల్లో రాజకీయ, ఓట్ల చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. చదువు కుంటేనే కులం యొక్క గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. గవర్నమెంట్ ఉద్యోగాల్లోనే కాదు అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ వెంకటరాజయ్య మాట్లాడుతూ సీఎం కుర్చీ కోసం ఆ ఇద్దరూ కొట్టుకుంటే మూడోవాడు లాభపడే అవకాశం ఉందన్నారు. ప్రైవేట్​రంగంలోనూ రిజర్వేషన్లను అమలుచేయాలని డిమాండ్​చేశారు. ప్రభుత్వం చదువు, ప్రభుత్వం కొలువు అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. బీసీ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేదాకా నిద్రపోయేదిలేదన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం, దూడ యాదేశ్వర్, బీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు, జడ్పీటీసీ విజయ్ కుమార్, సర్పంచ్ కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్​.కృష్ణయ్య