Breaking News

లంచం సొమ్మును కాల్చేసిన వైస్​ ఎంపీపీ

లంచం సొమ్మును కాల్చేసిన వైస్​ ఎంపీపీ

  • ఏసీబీకి పట్టుబడిన వెల్దండ తహసీల్దార్​, ఆయన బినామీ
  • తహసీల్దార్​ సైదులు గౌడ్​, వెంకటయ్య గౌడ్​ అవినీతి వెలుగులోకి..
  • పేదల కడుపుకొట్టి.. పెద్దలకు పంచిన సదరు అధికారపార్టీ నేత

సారథి, కల్వకుర్తి/వెల్దండ: ఏసీబీ అధికారులు దాడులు చేయడానికి వచ్చారని తెలుసుకుని నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ తహసీల్దార్​ బినామీ అయిన మాజీ వైస్​ ఎంపీపీ వెంకటయ్య గౌడ్​ రూ.ఐదులక్షల నోట్లను కాల్చివేశాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలో కలకలం సృష్టించింది. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. తలకొండపల్లి మండలం కోరింతతండాకు చెందిన రాములు నాయక్ వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో 15 ఎకరాల పొలాన్ని కొన్నాడు. ఇందులో క్రషర్ మిషన్ ఏర్పాటు, మైనింగ్​ తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. మైన్స్ అధికారులు ఎన్​వోసీ తీసుకురావాలని కోరడంతో రాములు నాయక్ వెల్దండ తహసీల్దార్ ఆఫీసులో ఎన్ వోసీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పనికావడానికి టీఆర్ఎస్ నాయకుడు, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ ను తహసీల్దార్​ సైదులు గౌడ్​ కలవమని సూచించాడు. రాములు నాయక్ ఈ విషయాన్ని వెంకటయ్య గౌడ్ దృష్టికి తీసుకువెళ్లగా ఎన్ వోసీ కోసం తహసీల్దార్ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, వాటిని సమకూరిస్తే వెంటనే వస్తుందని చెప్పాడు. చివరకు రూ.ఐదులక్షల రూపాయలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రాములు నాయక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పాడు. వారిచ్చిన రూ.ఐదులక్షలను కల్వకుర్తి పట్టణంలోని అతని నివాసంలో వెంకటయ్య గౌడ్ కు అందజేశాడు.

ఏసీబీ అధికారులకు పట్టుబడిన మాజీ వైస్​ ఎంపీపీ వెంకటయ్యగౌడ్​, తహసీల్దార్​ సైదులు గౌడ్​

స్టౌపై నోట్లను కాల్చేశాడు
ఆ డబ్బులు చెల్లించి రాములు నాయక్ బయటకు వచ్చిన వెంటనే ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది మెరుపు దాడులు చేశారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన టీఆర్​ఎస్​ నాయకుడు వెంకటయ్య గౌడ్ వెంటనే తలుపులు వేసుకుని తాను తీసుకున్న డబ్బులకు వంట గ్యాస్ స్టౌపై నిప్పంటించాడు. ఏసీబీ అధికారులు తలుపులను గట్టిగా లాగేసి లోపలికి వెళ్లి మంటల్లో కాలిపోతున్న డబ్బును తీసుకున్నారు. అప్పటికే నోట్లు 70 శాతం మేర కాలిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకుని వెంకటయ్య గౌడ్ తో పాటు తహసీల్దార్ సైదులు గౌడ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. వెల్దండ తహసీల్దార్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ లో ఉన్న తహసీల్దార్, టీఆర్ఎస్ నేత వెంకటయ్య గౌడ్ ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు చేసినట్లు సమాచారం. ఇద్దరి అవినీతి అక్రమాలను వెలికితీసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు.