- ఏడేళ్లలో రూ.12వేల కోట్ల వ్యయంతో
- 2వేల కి.మీ.కు పైగా హైవేల నిర్మించాం
- కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన
- ఢిల్లీ, డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు ప్రధాని మోడీ శ్రీకారం
డెహ్రాడూన్: ఐదేళ్లలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని ప్రధాని నరేంద్రమోడీ గుర్తుచేశారు. కేంద్రం కేటాయించిన అభివృద్ధి ప్రాజెక్టుల్లో రూ.18వేల కోట్లకు పైగా కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రధాని వెల్లడించారు. దేశమంతటా.. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం వందలక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఢిల్లీ, డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ, డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.8,300 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుందన్నారు. కారిడార్ సిద్ధమైన తర్వాత ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణించే సమయం సగానికి సగం తగ్గుతుందని చెప్పారు. కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు.
సైన్యాన్ని విస్మరించారు
అన్ని ప్రాంతాలను నిరుత్సాహపరిచారని, ముఖ్యంగా సైన్యాన్ని కూడా విస్మరించారని ఆగ్రహం ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఒక ర్యాంక్, ఒకే పెన్షన్ విధానాలను అమలు చేశామన్నారు. సైన్యానికి ఆధునిక ఆయుధాలు అందించామని.. ఉగ్రవాదులకు తగిన సమాధానమిచ్చామని గుర్తుచేశారు. మన పర్వతాలు, సంస్కృతి మన విశ్వాసం మాత్రమే కాదు మన దేశభద్రతకు కోటలు కూడా ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన సౌలభ్యానికి తాము ప్రాధాన్యత నిస్తామని స్పష్టం చేశారు. ఏడేళ్లలో ఉత్తరాఖండ్‌లో రూ.12వేల కోట్ల వ్యయంతో రెండువేల కిలోమీటర్ల కంటే ఎక్కువ హైవేలను నిర్మించించామని ప్రధాని నరేంద్రమోడీ గుర్తుచేశారు. పర్వత ప్రాంతాల్లో నివసించే వారు సులభంగా జీవనయానం సాగించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో మూడు వైద్యకళాశాలలు ఏర్పాటు చేశామని, హరిద్వార్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశామని చెప్పారు. రిషీకేష్‌లో ఇప్పటికే ఎయిమ్స్ సేవలు మొదలయ్యాయని, కుమావూలో శాటిలైట్ కేంద్రం ప్రారంభం కానుందని చెప్పారు.
వ్యాక్సినేషన్లో ఉత్తరాఖండ్ ఫస్టు
వ్యాక్సినేషన్‌లోనూ ఉత్తరాఖండ్ ముందుందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు రాజకీయాల కోసం రాష్ట్రానికి ఉన్న పేరు చెడగొట్టాలని చూస్తున్నారని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం వారి ఆటలు చెల్లవని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.