- బెంగాల్ దంగల్ లో దీదీ విజయం
- ఎత్తులు వేసి.. చిత్తయిన బీజేపీ
- తమిళనాడులో డీఎంకే జయకేతనం
- కేరళలో రెండోసారి విజయన్ సర్కారు
- అసోం, పుదుచ్చేరిని దక్కించుకున్న ఎన్‌డీఏ
న్యూఢిల్లీ: బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ దుమ్ములేపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 209 సీట్లను కైవసం చేసుకుంది. దీదీ సారథ్యంలో తీన్ మార్ మోగించింది. ఏకంగా అధికారాన్ని చేపడతామని గొప్పలు చెప్పిన కాషాయదళం మమతా బెనర్జీ ఎత్తుల ముందు బోల్తాపడింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు పలు విడతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఫలితాలను ఎన్నికల సంఘం ఆదివారం కౌంటింగ్ చేసి విడుదల చేసింది.
బీజేపీ బోల్తా..
294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమబెంగాల్ లో మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్కాంగ్రెస్209 సీట్లలో జయకేతనం ఎగరవేసింది. కాషాయదళం 81 సీట్లతో ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. పదేళ్ల క్రితం అధికారం కోల్పోయిన కమ్యూనిస్టు పార్టీల ఉనికి ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్ కూడా ఖాతా తెరవకుండానే కథ ముగించింది. బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 148 మేజిక్ ఫిగర్ రావాలి. కానీ తృణమూల్ కాంగ్రెస్అంతకన్నా ఎక్కువస్థానాలనే గెలుచుకుంది. అయితే చివరిదాకా మమతాబెనర్జీ విజయం దోబూచులాడింది. నందిగ్రామ్ లో తృణమూల్చీఫ్మమతాబెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేంద్ర అధికారి పోటీచేశారు. ఇద్దరి మధ్య విజయం ఉత్కంఠ లేపింది. ఫలితం ప్రకటించకుండానే కేంద్ర ఎన్నికల సంఘం వాయిదావేసింది. ఇక తమిళనాడులో పదేళ్ల అన్నాడీఎంకే అధికారానికి డీఎంకే బ్రేక్ వేసింది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 157 సీట్లను డీఎంకే గెలుచుకోగా, 76 స్థానాలకే అన్నాడీఎంకే పరిమితమై ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాల్సి వచ్చింది. స్టార్ఇమేజీతో రాజకీయ రంగప్రవేశం చేసిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పార్టీ ఒక్కస్థానాన్నీ కూడా గెలవలేకపోయింది. మేజిక్ ఫిగర్ 118కు మించి సీట్లలో గెలిచిన డీఎంకే ద్రవిడ నాట స్టాలిన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
లెఫ్ట్ ఫ్రంట్ రికార్డు బ్రేక్
కేరళలో నాలుగు దశాబ్దాల పాటు అధికారపక్షం వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ 99 సీట్లను గెలుచుకుని రెండోసారి అధికారం నిలుపుకుంది. కాంగ్రెస్నేతృత్వంలోని యూడీఎఫ్ 41 సీట్లను గెలుచుకోగా విపక్ష స్థానంలోనే ఉండిపోయింది. శబరిమల అంశంతో హడావుడి చేసిన బీజేపీ ఖాతా తెరవకుండానే బోల్తాపడింది.
గెలిచి… నిలిచి
అసోంలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారాన్ని పదిలం చేసుకుంది. 126 స్థానాలకు గానూ 74 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 50 సీట్లను కైవసం చేసుకొని ఈశాన్యంలో పట్టునిలుపుకుంది. సీఎంగా సర్బానంద్ సోనావాల్, లేదా హిమంతబిశ్వను ఎంపికచేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో 16 సీట్లతో ఏఐఎన్‌ఆర్‌సీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ చీఫ్ రంగస్వామి ఓడిపోయారు. కాంగ్రెస్ 9 స్థానాల్లో, ఇతరులు మరో ఐదు స్థానాల్లో విజయం సాధించారు. ఎన్‌డీఏ అధికార పీఠం చేపడుతున్నా సీఎం ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.