Breaking News

దీక్షతో వణుకు పుట్టింది

దీక్షతో వణుకు పుట్టింది
  • జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిందే..
  • లేకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
  • ఇంటింటికీ ఉద్యోగం ఏమైంది
  • పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌

సామాజికసారథి, హైదరాబాద్‌: బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షను సీఎం కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని, దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​అన్నారు. రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చారన్నారు. వైపు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతుంటే ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం ఊడగొడుతోందని మండిపడ్డారు. ఏడేళ్లుగా గ్రూప్‌ 1, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వలేదని, పైగా రాష్ట్రంలో 12వేల మంది విద్యావలంటీర్లను, ఏడువేలకు పైగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను, 600మందికి పైగా మిషన్‌ భగీరథ కార్మికులను తొలగించారని వివరించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఇన్​చార్జ్​తరుణ్‌ చుగ్‌ నిరుద్యోగ దీక్ష చేపట్టారు. పార్టీ నేతలు విజయశాంతి, స్వామిగౌడ్‌, పొంగులేటి సుధాకర్​రెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు దీక్షలో పాల్గొన్నారు. నిరుద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీక్షచేస్తున్న బండి సంజయ్‌కు ఆర్టీసీ మాజీచైర్మన్​గోనె ప్రకాశరావు సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్​మాట్లాడుతూ.. జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్‌ జరిపే అసెంబ్లీ సమావేశాలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు. సభలో ఎమ్మెల్యేలు, బయట తమ పార్టీ శ్రేణులు, నిరుద్యోగ యువత అసెంబ్లీని నడవనీయబోమని హెచ్చరించారు. దేనికైనా తెగించి కొట్లాడతామని చెప్పారు. తన దీక్షకు సంఘీభావం ప్రకటించిన ఓయూ విద్యార్థులతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

బహిరంగ చర్చకు సిద్ధమా: తరుణ్‌ చుగ్‌

అంతకుముందు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేశారన్నారని, రాష్ట్రం కోసం పోరాడిన యువతను సీఎం మరిచిపోయారని విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పారన్నారు. ఈరోజు ఉద్యమకారులంతా బీజేపీ వెంట నడుస్తున్నారని అన్నారు. ఏడేళ్ల పాటు మీరేం చేశారు? బండి సంజయ్‌తో బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఉద్యోమ ద్రోహులకు టీఆర్‌ఎస్‌ పెద్దపీట వేస్తోందన్నారు. నిరుద్యోగ దీక్షకు వస్తున్న నేతలను అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. ఉద్యోగాలు లేక తెలంగాణలో యువత ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని అన్నారు. డిగ్రీలు, చదువులు మాని.. ఉద్యమంలో యువత పాల్గొన్నారని గుర్తుచేశారు.

ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ బీ టీమ్​అని తరుణ్‌ చుగ్‌ విమర్శించారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. మరోవైపు జాబ్‌ నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారో చెప్పకుండా మంత్రి కేటీఆర్‌ బండి సంజయ్‌ పై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. బహిరంగ లేఖ పేరుతో మంత్రి కేటీఆర్‌ చేసిన విమర్శలు నిరుద్యోగులను అవమానించడమేనని అన్నారు. ఏడేళ్లుగా ఉద్యోగాలని ఊరిస్తుండటమే తప్ప చేసిందేమీ లేదన్నారు. ఇప్పటివరకు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, పలువురు నేతలను టీఆర్‌ఎస్‌ సర్కారు అక్రమ అరెస్టు చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి మండిపడ్డారు.