Breaking News

వనపర్తి లో టఫ్ ఫైట్

మేఘారెడ్డి కి టికెట్ ఇవ్వడంతో మారిన రాజకీయం కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరి పోరుటికెట్ల పంచాయతీలోనే బీజేపీఅభివృద్ది పేరుతో మంత్రి నిరంజన్ రెడ్డి

ప్రచారంఅవినీతి పాలన అంతం చేయాలంటూ మేఘారెడ్డి పిలుపుఓటర్ల తీర్పుపై అంతటా ఆసక్తి

సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ముందుగా మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి కెటాయించినా ఆ తర్వాత వ్యతిరేకత రావడంతో మేఘారెడ్డి కి ఫైనల్ చేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మార్పు చెందుతున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన మేఘా రెడ్డి కి టికెట్ కన్ ఫం కావడంతో మంత్రి నిరంజన్ రెడ్డి ని ఢీకొట్టే సత్తా మేఘారెడ్డికే ఉందన్న విషయం ప్రజల్లోకి నేరుగా వెళ్లిపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి అభివృద్ది పేరుతో ఆశీర్వదించాలని నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తుండగా అభివృద్ది పేరుతో అవినీతికి పాల్పడ్డారని అవినీతి పాలనను అంతమొందించాలని కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి ప్రజలకు పిలుపునివ్వడం సంచలనంగా మారుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గ ప్రజలు విలక్షణ తీర్పుతో అభ్యర్థులకు పట్టం కడుతూ వస్తున్నారు. తాజా ఎన్నికల పరిస్థితులను గమనిస్తే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ల మధ్యే టఫ్ ఫైట్ ఉండబోతుందని తెలుస్తోంది. పైగా ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా వరుసగా మూడు సార్లు విజయం అందించిన చరిత్ర వనపర్తి నియోజకవర్గంలో లేకపోవడం ఇదే సెంటిమెంట్ కొనసాగితే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటమి తప్పదని చెప్పవచ్చు.అభివృద్ది మంత్రం పారేనా…?వనపర్తి నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గా బాధ్యతలు నిర్వహిస్తున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ ఎన్నికలలో అభివృద్ది మంత్రాన్ని జపిస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సాగునీరు, రోడ్ల విస్తరణ, చెరువుల మరమ్మత్తు, తదితర పథకాలను అమలు చేశానని మంత్రి నిరంజన్ రెడ్డి తన ప్రచారం కొనసాగిస్తున్నారు. కాని నియోజకవర్గంలో అభివృద్ది పేరితో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన వాటిలో కొన్నింటికి స్వంత భవనాలు లేకపోవడం, అద్దె భవనాల్లో అవస్థలు పడుతున్నారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. పైగా మెడికల్ కాలేజీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ పథకాలలో ఔట్ సోర్సీంగ్ ఉద్యోగాలు మంత్రి కనుసన్నల్లో అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చెరువుల మరమ్మతులో నాసిరకం పనులు, రోడ్ల విస్తరణలో అసంపూర్తి పనులు మంత్రి అభివృద్ది జపానికి ఆటంకం కలిగిస్తున్నాయి. దళిత బందు విషయంలో నియోజకవర్గంలో మొదటి విడతలో అన్ని మండలాలకు సమాన ప్రాదాన్యత ఇవ్వకపోవడం, బీఆర్ఎస్ లీడర్ల కే అధికంగా దళితబందు ఇవ్వడం మంత్రి పై వ్యతిరేకతకు దారితీస్తోంది. ఇటీవల గోపాల్ పేట మండలంలో దళిత బందు కోసం దళితులు రోడ్డెక్కి ప్రశ్నించడం, ప్రశ్నించిన దళితులపై పోలీసు కేసులు నమోదు చేయించడం మంత్రికి మరింత వ్యతిరేకతను తీసుకువచ్చింది. నీళ్ల నిరంజనుడిగా పేరు తెచ్చుకున్నా ఇప్పటికి వనపర్తి నియోజకవర్గంలో సాగు నీటి కోసం జూరాల కాల్వల మీద రైతుల గొడవలు, జూరాల కార్యాలయాల ముందు రైతుల నిరసనలు చేయాల్సీ రావడంతో చివరి ఆయకట్టు సాగునీటి రైతాంగం అధికార బీఆర్ఎస్ పార్టీ పై గుర్రుగానే ఉండడం మైనస్ గా మారుతోంది. పైగా విలువైన పెబ్బేరు సంత భూములలో మంత్రి జోక్యం చేసుకోవడం, వనపర్తి నడిబొడ్డున కోట్ల విలువ చేసే భూములలో సెటిల్ మెంట్లు చేయడం , వందల ఎకరాలలో మూడు చోట్ల భారీ ఫామ్ హౌజ్ లు కట్టుకోవడం మంత్రి నిరంజన్ రెడ్డి కి మరింత వ్యతిరేకత తీసుకువచ్చింది. అధికార పార్టీ లీడర్లు అందినకాడికి దండుకున్నా, ప్రభుత్వ శాఖల అధికారులు సైతం అవినీతి, అక్రమాలకు పాల్పడినా కేవలం తన పనులు చేస్తే చాలన్నట్లు గా వనపర్తి జిల్లాలో పాలన కొనసాగడంపై సామాన్య ప్రజలు మంత్రి నిరంజన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. అవినీతిని అంతం చేద్దామంటున్న మేఘా రెడ్డి…

బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో చేరిన అతి కొద్ది సమయంలోనే మేఘారెడ్డి వనపర్తి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకోవడం బాగా కలిసి వచ్చింది. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ పార్టీ పై వ్యతిరేకత భారీగా పెరిగిపోవడం క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అక్రమాలకు పాల్పడి అక్రమ సంపాదనకు అలవాటు పడడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. వనపర్తి నియోజకవర్గంలో నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అతి తక్కువ సమయంలో మేల్కొలిపి ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మేఘారెడ్డి సక్సెస్ కావడం విశేషం. కాని నియోజకవర్గంలో టికెట్ ఇచ్చినంత మాత్రాన ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదని కాంగ్రెస్ పార్టీ లోని లీడర్లే కాదు క్యాడర్ సైతం మేఘా రెడ్డి వెంట కలిసి వస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. అధికారంలో ఉండి అటు అధికార బలం ఇటు అర్థిక బలం ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కోవడం అంతాఈజీ కాదన్న విషయం అంతా గమనిస్తున్నా మంత్రి అవినీతి పాలనపై మేఘారెడ్డి పోరాటం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సీందే.సీట్ల పంచాయతీలోనే బీజేపి…

వనపర్తి నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ ఉన్న కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఉన్నా ప్రధానంగా పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉండబోతుందన్న చర్చ కనిపిస్తోంది. వనపర్తి బీజేపీ లో స్థానిక నాయకులకు టికెట్ ఇవ్వలేదన్న పంచాయతీ కొనసాగడం, స్థానికంగా లేని అశ్వధ్దామ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై బీజేపీ క్యాడర్ నిరాశగా మారింది. కొద్దోగొప్పో ఓటు బ్యాంక్ ఉన్న సీనియర్ టీడీపీ లీడర్ రావుల చంద్రశేఖర్ రెడ్డి సైతం తాజాగా బీఆర్ఎస్ లో చేరినా ఆ పార్టీకి బలం పెరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ లీడర్లు కొందరు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వమని పార్టీ ఉన్నంత వరకు టీడీపీ లోనే కొనసాగుతామని ప్రకటించడం విశేషం. దీంతో వనపర్తి నియోజకవర్గంలో ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందన్నది నియోజకవర్గ ప్రజలు బలంగా నమ్ముతున్నారు.