- మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- మరోవైపు వణికిస్తున్న ఒమిక్రాన్
- 3నుంచి 4 రెట్లు వేగంగా వ్యాప్తి
- చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆంక్షలు
- తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష
- 15 నుంచి 18 ఏళ్లలోపువారికి వ్యాక్సినేషన్
- అలర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 27వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు 21శాతం పెరిగాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల్లో కూడా పెరుగుదల హెచ్చుమీరుతోంది. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకూ ఇది విస్తరించింది. శనివారం ఉదయం 1,400 ఉన్న కొత్త వేరియంట్ కేసుల సంఖ్య ఆదివారం నాటికి 1,525కి చేరింది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర 460, ఢిల్లీ 351 తొలి రెండు స్థానాల్లో ఉండగా.. గుజరాత్ 136, తమిళనాడు 117, కేరళలో 109 కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశం ఓ పెద్ద సవాల్ ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్కూడా సూచించారు. కాగా, సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసులు క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తున్నాయి. ఒమిక్రాన్వేరియంట్ఇప్పటికే 140 దేశాల విస్తరించడంతో అమెరికాతో సహా చాలా దేశాల్లో లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటికే చాలా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా పెద్దసంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యంగా నడవడం ప్రారంభమైంది. 2021 ఏడాది చివరి రోజు అయిన శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2,600 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో అమెరికాలోనే 1,200 విమానాలు ఉన్నాయి. అలాగే 4,900 వరకు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. క్రిస్మస్ సెలవులు కావడంతో సాధారణంగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఒమైక్రాన్ భయంతో చాలా మంది ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయని పరిస్థితి నెలకొన్నది.
అప్రమత్తమైన రాష్ట్రాలు
– అప్రమత్తమైన పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షల బాట పడుతున్నాయి. ఇక తమిళనాడులో ఇప్పటికే 117కి పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో కఠిన ఆంక్షలు అమలు చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో యాభై శాతం ఆక్యుపెన్సీతో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో మాల్స్, సినిమా థియేటర్లు, బస్సులు, మెట్రో రైళ్లు ఉండేలా చూడాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.
– మధ్యప్రదేశ్‌లో సైతం ఒమిక్రాన్కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్చౌహన్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం ఆయన భూపాల్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ ప్రారంభమైందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోగలమని సూచించారు. అలా సాధ్యం కాకపోతే యుద్ధం సజావుగా సాగదని వ్యాఖ్యానించారు. ‘కొవిడ్ థర్డ్‌వేవ్ వచ్చేసింది. ప్రజల భాగస్వామ్యంతోనే దీనిపై పోరాడగలం. ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రజలు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని సూచించారు.
కేంద్రవైద్యశాఖ మంత్రి సమీక్ష
దేశంలో మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీచేస్తోంది. ఇదే క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్త్ మినిస్టర్లు, ఉన్నతాధికారులతో ఆన్‌లైన్ వేదికగా సమావేశమయ్యారు. ఒమిక్రాన్ వ్యాప్తి, వైద్యవ్యవస్థల సన్నద్ధత, ప్రికాషన్ డోసులు, 15-18 ఏళ్లవారికి టీకాల పంపిణీ తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. మునుపటి వేవ్‌లతో పోలిస్తే ప్రస్తుతం కేసుల పెరుగుదల మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉందని మాండవీయ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా మౌలిక వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచాలని రాష్ట్రాలకు సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని, పరీక్షలు పెంచాలని, కఠినమైన ఆంక్షలను అమల్లోకి తీసుకురావాలని కోరారు. ఒమిక్రాన్‌పై పోరాటంలో ఇదివరకు ఎదురైన అనుభవాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టండి
ప్రధానంగా వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి సారించాలని కేంద్రమంత్రి మాండవీయ సూచించారు. ఈ క్రమంలో వీక్లీ ప్లానింగ్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. 15 నుంచి 18 ఏళ్లలోపువారికి టీకాల కోసం ఎన్ని డోసులు అవసరమో వివరాలు సమర్పించాలని సూచించారు. ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ నిధుల్లో 17 శాతమే ఖర్చుచేశారని, బెడ్‌ల ఏర్పాటు తదితర మౌలిక వసతుల కోసం వాటిని వినియోగించాలన్నారు. టెలిమెడిసిన్, టెలికన్సల్టేషన్ విధానాలను ప్రోత్సహించాలని కేంద్రమంత్రి కోరారు.