Breaking News

బ్యాట్‌తో పొట్టు పొట్టు కొట్టుకున్నారు

  • వనపర్తి మైనార్టీ గురుకులంలో ఘటన
  • రెండు గ్రూపులుగా 9వ తరగతి స్టూడెంట్లు
  • క్రికెట్ బ్యాట్ తో కొట్టడంతో ఓ స్టూడెంట్ కు తీవ్ర గాయాలు
  • సర్జరీ చేసేందుకు హైదరాబాద్ కు తరలింపు
  • బయటికి పొక్కకుండా టెమ్రీస్ అధికారుల జాగ్రత్తలు

సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీనివాసపూర్ గ్రామ శివారులో అద్దె భవనంలో కొనసాగుతున్న మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ఈ నెల 2న స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది. ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న స్టూడెంట్లు రెండు గ్రూపులుగా ఏర్పడి గొడవకు దిగారు. తరగతి గదిలో ఆధిపత్య పోరు కోసం 9వ తరగతిలో ఇదివరకే స్టూడెంట్లు రెండు వర్గాలుగా ఏర్పడినా ఇక్కడి ప్రిన్సిపాల్ గాని టీచర్లుగాని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో తాజాగా ఈ గొడవ కొట్టుకోవడానికి దారితీసింది. ఈ నెల 2వ తేది ఆదివారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో యాదగిరి అనే స్టూడెంట్ సోహైల్ అనే స్టూడెంట్ ను ఏకంగా క్రికెట్ బ్యాట్ తో చితకబాదినట్లు తెలిసింది. ఈ సంఘటన లో సోహైల్ కు ముఖం పై తీవ్రగాయాలు కావడంతో అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పాఠశాలలోని స్టూడెంట్లు గ్రూపులుగా ఏర్పడినా ఈ గొడవలు ముందునుంచే ఉన్నా వాటిని అరికట్టడంలో అక్కడి ప్రిన్సిపాల్, టీచర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంత పెద్ద సంఘటన జరిగినా గోప్యంగా ఉంచడంతో పాటు క్రికెట్ బ్యాట్ తో కొట్టిన యాదగిరిని గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపించి చేతులు దులుపుకున్నారు. ఆస్పత్రిలో గాయాలపాలైన సోహైల్ కూడా ఏమీ కాదని అంతా సర్దుకుంటుందని చెప్పకొస్తున్నారు. అసలు ఆ రోజు గొడవ ఎలా జరిగింది అంతా ఉదయాన్నే క్రికెట్ బ్యాట్ ఎలా వచ్చిందనే విషయం పాఠశాలలో ఉన్న సీసీ టీవీ పుటేజీ లను పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మైనార్టీ గురుకులాలపై పర్యవేక్షణ ఏదీ
వనపర్తి జిల్లాలో కొనసాగుతున్న మైనార్టీ గురుకులాలపై టెమ్రీస్ అధికారుల పర్యవేక్షణ పక్కాగా లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వనపర్తి మైనార్టీ బాయ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆనంద్ బాబు గత 3 నెలలుగా తన కొత్త ఇంటి నిర్మాణం పైనే పూర్తి దృష్టిపెట్టి పాఠశాల నిర్వహణ గాలికొదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. తాను ప్రిన్సిపాల్ కాబట్టి తాను చెప్పినట్లే డ్యూటీలు చేయాలని రూల్స్ కు విరుద్దంగా తన కొత్త ఇంటి నిర్మాణానికి ఇక్కడి నాన్ టీచింగ్ స్టాప్ ను నీళ్లు పట్టడం, క్లీనింగ్, మట్టిపని తదితర పనులకు ఉపయోగించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రిన్సిపాల్ తన సొంత పనుల్లో నిమగ్నం కావడంతో ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్, వార్డెన్, డీఈఓలు పెద్దదిక్కుగా మారి అన్ని పనులను చక్కబెడుతున్నారు. పైగా వనపర్తి జిల్ల మైనార్టీ సంక్షేమాధికారిగా రెగ్యులర్ అధికారి లేకపోవడం, ఇంచార్జీ బాధ్యతలు తీసుకున్న అధికారులకు మైనార్టీ గురుకులాలను పట్టించుకునే తీరిక లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అంతేకాకుండా వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల మూడు జిల్లాల మైనార్టీ గురుకులాలను పర్యవేక్షించేందుకు నియమించిన ఆర్ఎల్ సీ (రీజినల్ లెవల్ కోఆర్డీనేటర్ ) హవేళారాణి సైతం చుట్టపుచూపుగా స్కూళ్లకు , జూనియర్ కాలేజీలకు వెళ్లివస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. పైగా వనపర్తి జిల్లా కేంద్రంలోనే ఆర్ఎల్ సీ కార్యాలయం ఉండడంతో మిగిలిన రెండు జిల్లాల మైనార్టీ గురుకుల స్కూళ్లు , కాలేజీల సిబ్బంది ప్రతి సంతకానికి వనపర్తికి వచ్చి పడిగాపులు కాసి సంతకాలు పెట్టించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా డీఎం డబ్ల్యుఓ, ఆర్ ఎల్ సీ లాంటి అధికారులు వనపర్తి జిల్లా కేంద్రలో ఉన్నా పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది మొక్కుబడిగా డ్యూటీలు చేస్తూ తమ సొంత పనులను చక్కపెట్టుకుంటున్నారు.

గొడవ జరిగింది నిజమే
వనపర్తి మైనార్టీ బాలుర పాఠశాలలో గొడవ జరిగిన విషయం వాస్తవమే. కానీ స్టూడెంట్లు గ్రూపులుగా ఏమీ గొడవ పడలేదు. కేవలం ఇద్దరు స్టూడెంట్లు మాత్రం ప్లే గ్రౌండ్ లో గొడవపడి కొట్టుకున్నారు. గాయాలు తగిలిన స్టూడెంట్ కూడా ప్రస్తుతం కోలుకున్నాడు. ఎలాంటి పెద్దగాయాలు కాలేదు.