- రైతు ఉయ్యాలవాడ కాశన్న ఆత్మహత్యకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బాధ్యత వహించాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫైర్
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: టూరిజం పేరుతో కోట్ల రూపాయలను ఖర్చుచేసి ట్యాంక్‌బండ్ అభివృద్ధి పేరుతో వంద ఎకరాలను ముంపునకు గురిచేసి ఉయ్యాలవాడ దళితరైతు కాశన్న ఆత్మహత్యకు కారకుడైన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో రాష్ట్ర కార్యాలయంలో నాగర్‌కర్నూల్‌జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఇన్చార్జ్ దిలీప్ ఆచారితో కలిసి దళితరైతు కాశన్నకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అక్రమదందాలను వెలికితీస్తామన్నారు. నాగర్ కర్నూల్ చెరువులో నీళ్లు నిండుగా నింపడంతో పట్టాభూమిని సేద్యం చేసుకోలేక, ఎమ్మెల్యే చుట్టూ తిరిగి తిరిగి ఎంతకూ న్యాయం దక్కలేదని రైతు కాశన్న ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. రైతులకు అన్యాయం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా వదిలిపెట్టేది లేదన్నారు. నల్లమట్టి దొంగ మర్రి జనార్దన్ రెడ్డి కోట్ల వ్యాపారాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. నల్లమట్టి దందా బయటపడుతుందనే చెరువును నింపి నిరుపేద దళితుల పొట్టగొడుతున్నారని అన్నారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తిరుపతయ్య పాల్గొన్నారు.