- రోడ్డుపైనే వరికుప్పలకు నిప్పు
- మొలకెత్తిన వడ్లతో నిరసన
- కాంటా పెట్టినా లారీలు వస్తలేవని ఆక్రందన
సామాజిక సారథి, చిలప్ చెడ్: రైతుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెగింది. ధాన్యం తరలింపులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం చిట్కుల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సోమక్కపేట సహకార సంఘం ఆధ్వర్యంలో 10 సెంటర్లు, ఐకేపీ ఆధ్వర్యంలో మరో మూడు ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. చిట్కుల్ ధ్యానం తరలించేందుకు లారీలు రావడంలేదు, కాంటా వేగవంతంగా జరగడం లేదని సుమారు రెండు గంటల పాటు రైతులు ఆందోళన చేపట్టారు. ‘సొసైటీ చైర్మన్ డౌన్ డౌన్.. కేసీఆర్ డౌన్ డౌన్.. కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ రైతులు నినదించారు. రోడ్డుపైనే వరికుప్పలను మంటపెట్టి తగులబెట్టారు. మొలకెత్తిన వడ్లతో రైతులు నిరసన తెలిపారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి ఎస్సై మల్లారెడ్డి, తహసీల్దార్ సహదేవ్ పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఎస్సై మల్లారెడ్డి లారీలను తొందరగా పంపిస్తామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు.