- సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలి
- నాణ్యత విషయంలో రాజీపడొద్దు
- పరిశీలించి కొన్ని సూచనలు చేసిన సీఎం కేసీఆర్
సామాజికసారథి, హైదరాబాద్: నూతన సెక్రటేరియట్నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సచివాలయ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును అలాగే ముందుకు కొనసాగించాలని సూచించారు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని కోరారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషిచేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను అభినందించారు. ఏజెన్సీ ఇంజనీర్లతో పనులపై చర్చించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తూ అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. కారిడార్లు సహా గ్రౌండ్ఫ్లోర్లు, మొదటి ఫ్లోరుతో సహా నిర్మాణంలో ఉన్న సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగారు. తన వెంట వచ్చిన మంత్రి సబితాఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను సీఎం కేసీఆర్ఫైనల్ చేశారు. మోడల్ వాటర్ ఫౌంటేన్, లాండ్ స్కేప్, విశ్రాంతి గదులు, మీటింగ్ హాళ్లను సీఎం పరిశీలించారు. స్కైలాంజ్ నిర్మాణం గురించి సీఎం కేసీఆర్కు అధికారులు వివరించారు. నిర్మాణం పూర్తిచేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించి సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్వెంట ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఆర్అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఆర్అండ్ బీ శాఖ ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్అండ్ బీ, పోలీసు అధికారులు, నిర్మాణ ఏజెన్సీ షాపుర్జీ పల్లోంజి సంస్థ ప్రతినిధులు ఉన్నారు.