Breaking News

సమాధి తవ్వి మహిళ పుర్రెతో పరారీ

సమాధి తవ్వి మహిళ పుర్రెతో పరారీ
  • మహిబాత్‌ పూర్‌లో దుండగుల దుశ్చర్య

సామాజికసారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలంలోని మహిబాత్‌ పూర్‌ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సమాధిని తవ్వి మహిళ పుర్రెను ఎత్తుకెళ్లారు. ఈఘటన గ్రామంలో కలకలం రేపింది. రాయికోడ్‌ మండలం మహాబథ్‌ పూర్‌ గ్రామానికి చెందిన కొనింటి ఏలిశా బెతూ అనే మహిళ అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందింది. వారి గ్రామ శివారులో ఉన్న పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేశారు. కానీ, జనవరి 6న గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు సమాధి తవ్వి కాళ్లు, చేతులు, తల, పుర్రె ఎముకలను ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. సమాధి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు కారంపొడి చల్లి వెళ్లారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే క్షుద్రపూజల కోసం మహిళ ఎముకలను ఎత్తుకెళ్లారా..? లేదా మరేదైనా కారణం ఉందా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. కాగా ఈ ఘటన గురించి తెలిసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.