సామాజికసారథి, బిజినేపల్లి: కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా అందుకు క్షేత్రస్థాయిలో మాత్రం పర్యవేక్షణ లేదు. నాగర్ జిల్లాలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, మొక్కుబడి పర్యవేక్షణతో సర్కారు స్కూళ్లలో కొందరు టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, శుక్రవారం బిజినేపల్లి మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఓ టీచర్ జామకాయలకు పంపించిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం.. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఐదుగురు, 5వ తరగతి చదువుతున్న ఆరుగురు.. 11 మంది విద్యార్థులను పుష్పలత అనే టీచర్ స్కూలు సమీపంలోని గుట్టల్లోకి జామ కాయలను కోసుకురావాలని పంపించింది. అదే సమయంలో అటుగా వచ్చిన కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను చూసి నివ్వెరపోయారు. బడికి పంపించిన తమ పిల్లలు బయట తిరగడం ఏమిటని ఒకింత ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్కూలుకు వెళ్లి సదరు టీచర్ పుష్పలతను నిలదీశారు. ‘జామ కాయలు కావాలంటే కొనుక్కోవాలని, మా పిల్లలను గుట్టల్లోకి పంపిస్తే ఏదైనా విషపురుగులు కాటేసినా ఎవరు బాధ్యులు’ అంటూ ప్రశ్నించారు. దీనికి అక్కడున్న మహిళా టీచర్లు కొందరు తల్లిదండ్రుల మీదకే ఎదురుదాడికి దిగి తిట్ల పురాణం అందుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు మండలస్థాయిలో పెద్దదిక్కుగా ఉంటూ పర్యవేక్షణ బాధ్యతలు చూసే బిజినేపల్లి ఎంఈవో కార్యాలయ ఆవరణలోనే ప్రాథమికోన్నత స్కూలు ఉన్నా పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం.
టీచర్ ను నిలదీస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు