Breaking News

ఐదోరోజూ అదే రభస

అయిదవ రోజు అదే రభస
  • ధాన్యం కొనుగోళ్లపై పట్టువీడని టీఆర్‌ఎస్‌
  • తెలంగాణలో ధాన్యం దిగుబడి పెరిగిందన్న నామా
  • ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ ప్రకటించాలని డిమాండ్‌
  • రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసిన విపక్షాలు

న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై ఐదోరోజూ గురువారం పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన కొనసాగింది. టీఆర్ఎస్​ ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని  నిలదీశారు. ప్రొక్యూర్మెంట్‌ పాలసీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు.. వెల్‌లోకి దూసుకువెళ్లి రైతులను కాపాడాలని నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు. మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల పక్షాన నిలిచిందని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. తెలంగాణ సర్కార్‌ రైతులకు అండగా నిలవడం వల్ల రాష్ట్రంలో వరి పంట ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదైందని పేర్కొన్నారు. ఏడేళ్లలో వ్యవసాయానికి నీళ్లు ఇస్తున్నామని, ఉచితంగా కరెంట్‌ ఇస్తున్నామని, ఇంకా రైతు బంధు వల్ల కూడా తెలంగాణలో వరి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, దానితో పంట దిగుబడి కూడా పెరిగిందన్నారు. తెలంగాణ వరిరైతుల అంశాన్ని పరిష్కరించాలని, ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత అని, ఆ బాధ్యతలను కేంద్రం విస్మరిస్తోందని నామా అన్నారు. సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాజ్యసభలో  12 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు.

సభ నుంచి విపక్షాల వాకౌట్​
సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న క్రమంలో పలువురు రైతులు మరణించడం, ధరల పెరుగుదల వంటి అంశాలపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఆర్జేడీ, ఆర్జేడీ, ఐయూఎంఎల్‌, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం, డీఎంకే పెద్దల సభ నుంచి వాకౌట్‌ చేశాయి. రైతుల మృతి, ద్రవ్యోల్బణం అంశాలపై విపక్ష ఎంపీలు సభలో నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు పార్లమెంట్‌లో కొవిడ్‌ తాజా వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తిపై చర్చ మొదలైంది. ఒమిక్రాన్‌ పలు దేశాల్లో వ్యాప్తి చెందుతుండటం పట్ల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ మంత్రులతో భేటీ అయ్యారు.