Breaking News

గర్జించిన రైతులోకం

గర్జించిన రైతులోకం
  • సాగుచట్టాలపై ఉద్యమానికి ఏడాది
  • ఢిల్లీ సరిహద్దుల్లో మార్మోగిన నినాదాలు
  • మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్‌

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆందోళనలతో మార్మోగాయి. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని గతవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. రైతు సంఘాలు ఈ చర్యను స్వాగతిస్తున్నాయని, అయితే చట్టాలను అధికారికంగా రద్దుచేసి ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసన విరమించేది లేదని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. నిరసనకు ఏడాది సందర్భంగా ఢిల్లీ సరిహద్దులో శుక్రవారం భారీసభ నిర్వహించారు. వేలసంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టపరమైన హామీతో సహా తమ డిమాండ్లు నెరవేరే వరకు రైతుల ఆందోళన కొనసాగుతుందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేష్‌ టికాయత్‌ స్పష్టంచేశారు. అయితే రైతుల ఆందోళనలతో దేశ రాజధానిలోని పలు సరిహద్దు పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఏడాది కాలంగా రైతులు సింగు, తిక్రీ, ఘాజీపూర్‌ ప్రాంతాల్లో క్యాంపులు వేసి నిరసన కార్యక్రమాలు సాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, లఖింపూర్‌ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాను తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేయనున్నట్లు రైతులు తెలిపారు.