మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నం
సారథి, కొల్లాపూర్: తమ పొలానికి వెళ్లే దారిని మూసివేశారని మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం జనంపల్లిలో కలకలం రేపింది. బాధితులు, గ్రామస్తుల కథనం.. మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సాలమ్మ కుటుంబం 30 ఏళ్లుగా పొలానికి వెళ్తున్న దారిని పల్లెప్రకృతి వనాన్ని నిర్మించేందుకు గాను మూసివేశారు. దారి లేకపోవడంతో రాకపోకలకు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లగా పరిష్కరించకపోగా బెదిరింపులకు గురిచేయడంతో పాటు పోలీస్ కేస్ పెడతామని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో మనస్తాపానికి గురై వ్యవసాయ పొలానికి వెళ్లే మార్గంలోనే సాలమ్మ, ఆమె భర్త శేషయ్య, కుమారుడు శ్రీశైలం పురుగు మందు తాగారు. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.