Breaking News

పరాకాష్టకు చేరిన జగన్​ పాలన

పరాకాష్టకు చేరిన జగన్పాలన
  • మద్య నిషేధం పేరుతో సొంత బ్రాండ్లతో వ్యాపారం
  • పోలవరం పూర్తవుతుందన్న నమ్మకం లేదు
  • ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి : ఏపీలో జగన్‌ పాలన పరాకాష్టకు చేరిందని, పూర్తిగా అరాచకం పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రతిష్ఠను భ్రష్టు పట్టించారని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందని, 4వ తేదీ వస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏపీకి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు కూడా భయపడుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపి ఎన్నికలు అయ్యాక జగన్‌ మాట మార్చారని చంద్రబాబు విమర్శించారు. అమరావతిపై తాము రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టామని, కానీ జగన్ అమరావతిని విధ్వంసం చేయడం ద్వారా రూ. 2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారని మండిపడ్డారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. న్యూఇయర్‌లో ఒక్కరోజే రూ.124 కోట్ల అమ్మకాలు చేశారంటే మద్య నిషేధం ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లతో అంతా దోచుకుని ఇప్పుడు ప్రీమియం కంపెనీల బ్రాండ్‌లను అమ్ముతామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇటీవల రాష్ట్రంలో గంజాయి సరఫరా ఎక్కువ కావడంతో డ్రగ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ఇతర రాష్టాల్రు అవమానించే పరిస్థితి నెలకొందన్నారు. పోలవరంపై కాలయాపన చేసి రేట్లు పెంచారని, పోలవరం అసలు పూర్తవుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. వైసీపీ పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారని, రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ

ఆలోచించాలని ఆయన సూచించారు.