Breaking News

బహుజన రాజ్యాధికార సాధన

బహుజన రాజ్యాధికార సాధన
  • ఓయూ నుంచే మొదలవ్వాలి
  • బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ​కోఆర్డినేటర్​ డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్​​
  • ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆత్మీయ సమ్మేళనం

 సామాజికసారథి, హైదరాబాద్: బహుజన రాజ్యాధికార సాధన ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మొదలుకావాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్​ కోఆర్డినేటర్ ​డాక్టర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్ కుమార్ ​​ఆకాంక్షించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నేతలు ప్రాతినిథ్యం వహిస్తేనే పేదల బతుకులు మారుతాయని అన్నారు. మనువాదుల కుట్రలు విప్పాలంటే బహుజన మహనీయుల చరిత్రను అధ్యయనం చేయాలని సూచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గెస్ట్ హౌస్ వేదికగా భావసారుప్యత గల ఉద్యోగ, విద్యార్థి సంఘాలు మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. 2023ఎన్నికల్లో బహుజనులు రాజకీయ అధికారం సాధించడం ఎలా? అనే అంశంపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ​ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతూ.. ఓయూ ఎన్నో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విప్లవ ఉద్యమాలకు పుట్టినిల్లు అని, దశాబ్దాలుగా ఆధిపత్య కులరాజకీయాలపై అనునిత్యం నినదించే ధిక్కార స్వరమని అన్నారు. పాలక ప్రభుత్వాలు ఎన్ని నిర్భంధాలు విధించినా, ప్రశ్నించేతత్వం, అలుపెరుగని పోరాటాలు నేర్పే విద్యాక్షేత్రమని కొనియాడారు. ఎన్నో నిర్భందాలు ఎదుర్కొంటూ, వెనకడుగు వేయకుండా మడపతిప్పని విద్యార్థి యోధులను తయారుచేసిందని గుర్తుచేశారు. గుండెల నిండా గాయాలున్నా బహుజన ఉద్యమాలకు ఊపిరిలూది రాజకీయ యుద్ధ తంత్రం నేర్పిన రాజకీయ ప్రయోగశాల అని అన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘాల నేతలు, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.