- సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం
- రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కు
- భూ కబ్జాలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
- బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
సామాజికసారథి, జనగాం: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతోనే లక్షలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ, వడ్ల కుప్పలపై మరణించే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జనగాం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బీఎస్పీ జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బతుకమ్మకుంటలో భూ ఆక్రమణలకు పాల్పడిన స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారుల తప్పిదాలతో ధరణి పోర్టల్ లో పొరపాటుగా నమోదైన వేలాది ఎకరాల జాఫర్ గడ్ భూములను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మిలర్లతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి, వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ యూనివర్సిటీలకు బడ్జెట్ లో సరిపడా నిధులు కేటాయించకుండా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేయకుండా విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కానీ, అనురాగ్, మల్లారెడ్డి లాంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు వేలాది ఎకరాల భూమిని కేటాయిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్లు తొలగించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులు భరించలేక, ఎంతోమంది పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరణించే దుస్థితిని తెలంగాణలో నెలకొనడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 200 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు టీచర్లతో బోధన జరగుతోందని, ఇది ఎలా సమంజసం అవుతుందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఘాటుగా స్పందించారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనం, రైతు వేదికల నిర్మాణం కోసం పేదల అసైన్డ్ భూములను గుంజుకుంటున్న నియంత ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు నీలిరంగు జెండాలతో గ్రామాల్లోకి వచ్చే కుల సంఘాల నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తదనంతరం జిల్లాలోని జనగాం, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్, టీఆర్ఎష్ కార్యకర్తలకు కండువా కప్పి, ఆ పార్టీలోకి ఆహ్వానించారు.