- ప్రభుత్వం వద్ద ఎలాంటి రికార్డుల్లేవ్
- ఢిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన
- వారికి నష్టపరిహారం ఇవ్వలేం
- కేంద్రమంత్రి తోమర్ స్పష్టీకరణ
- కేంద్ర ప్రభుత్వం ‘లెక్క తప్పంది’
- కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో రైతులు మరణించిన దాఖలాలు లేవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. ఆందోళనల్లో మరణించిన రైతులకు రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారా? లేదా..? అని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాతపూర్వక సమాధానమిచ్చారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తూ మరణించిన రైతులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి రికార్డులు లేవని, కాబట్టి వారికి నష్టపరిహారం చెల్లించడం సాధ్యం కాదన్నారు. రికార్డులు లేనందున ప్రతిపక్షాలు ఇకపై ఆ ప్రస్తావన తేవొద్దని మంత్రి కోరారు.
కేంద్రమంత్రి ప్రకటనపై దుమారం
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనను కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తప్పుబట్టారు. రైతుల మరణాలకు సంబంధించి రికార్డులు లేవని చెప్పడం వారికి తీవ్ర అవమానమేనన్నారు. కేంద్రం అలాంటి ప్రకటన ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆందోళనల్లో చనిపోయిన 750 మంది రైతుల వివరాలు సేకరించలేకపోతే.. కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన లక్షల మంది డేటాను కరెక్టుగా సేకరించిందని ఎలా నమ్మగలమని ఖర్గే అనుమానం వ్యక్తం చేశారు. రెండేళ్లలో కరోనా కారణంగా 50 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతే.. ప్రభుత్వం మాత్రం కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే మరణించినట్లు చెబుతున్నదని ఆయన విమర్శించారు.