Breaking News

ఎంత కాలితే అంత బిల్లు

ఎంత కాలితే అంత బిల్లు
  •  విద్యుత్ ప్రీపెయిడ్ మీటర్లు
  • బిల్లు బకాయిలను తగ్గించేందు..
  • విద్యుత్ శాఖ సరికొత్త ప్రక్రియ
  • సంగారెడ్డి జిల్లాలో 6లక్షల కనెక్షన్లు

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లాలోని విద్యుత్ వినియోగానికి ప్రీపెయిడ్ మీటర్లను బిగించేందుకు ఆ శాఖ ప్రక్రియ మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు 1400 ప్రీపెయిడ్ మీటర్లను బిగించింది. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఆరు లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలను తగ్గించేందుకే ఈ ప్రక్రియను చేపట్టినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రివాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ సిస్టం (ఆర్డీఎస్ఎస్) ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా నష్టాల నివారణను అధిగమించే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో రోజురోజుకు పెరిగిపోతున్న బకాయిలు విద్యుత్ శాఖకు తలనొప్పిగా మారాయి. ఈ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుతో ఇలాంటి బకాయిలను కూడా నివారించవచ్చని ఆ శాఖ యోచిస్తోంది. అలాగే సెల్ ఫోన్, డీటీహెచ్ ల తరహాలో వినియోగదారులు ఆన్ లైన్ లో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వినియోగదారులకు ప్రత్యేకంగా ఒక కార్డును ఆ శాఖ వారు ఇస్తారు. ఈ కార్డును విద్యుత్ మీటర్ లో ఉంచితే ఎంత కరెంట్​ను వినియోగించారు.. ఇంకా ఎంత డబ్బు ప్రిపేర్ లో మిగిలి ఉన్న వివరాలు మానిటర్ పై డిస్​ప్లే కానున్నాయి. అయితే ఈ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం ఉండబోదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.