Breaking News

న్యాయ వ్యవస్థను పరిరక్షించుకోవాలి

న్యాయ వ్యవస్థను పరిరక్షించుకోవాలి
  • సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్ రమణ హితవు 

న్యూఢిల్లీ: చర్చకు అవకాశం కల్పించడం రాజ్యాంగ ముఖ్య లక్షణమని, మంచికి అండగా, చెడుకు వ్యతిరేకంగా నిలవాలని భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ఎన్‌వీ రమణ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ప్రేరేపిత, కక్షితదాడుల నుంచి న్యాయవ్యవస్థను పరిరక్షించాలని కోరారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ, డాక్టర్‌ భీమ్‌రావ్‌ రామ్​జీ అంబేద్కర్‌, జవహర్​లాల్​నెహ్రూ, లాలాలజపతిరాయ్‌, సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ చేసిన కృషి మరువలేమని కొనియాడారు. ఈ వర్గం స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప కృషిచేసిందని, రాజ్యాంగ రూపకల్పనలో విశేషపాత్ర పోషించిందని గుర్తుచేశారు. నేడు మనల్ని ఈ విధంగా నిలిపిన సమరయోధులు, రాజ్యాంగం రాసిన సభ్యులకు వినయపూర్వకంగా వందనం చేస్తున్నట్లు ప్రకటించారు. న్యాయమూర్తులు, వ్యవస్థకు సాయపడాలని న్యాయవాదులను కోరారు. మంచికి మద్దతు ఇవ్వడానికి, చెడును వ్యతిరేకించడానికి భయపడొద్దని, అయిష్టతను ప్రదర్శించవద్దని సూచించారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన వర్గంలో భాగస్వామిని అయినందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనేవి రాజ్యాంగానికి ప్రాతిపదికలని, వీటి గురించి అన్నివర్గాల ప్రజలకు తెలియజేస్తామని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.