సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన రంగరి పండరినాథ్ మృతి విషయంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎంపీపీ సంజీవరెడ్డి తనపై చేసిన ఆరోపణలు సరికాదని ఎంపీపీ జంగం శ్రీనివాస్ హితవు పలికారు. బుధవారం పెద్దశంకరంపేటలోని తన నివాసంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పండరినాథ్ మృతి కేసు కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని, అవసరమైతే పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చన్నారు. చట్టాలు ఎవరికీ చుట్టం కాదని పేర్కొన్నారు. కేసు విషయంలో పూర్తివివరాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. పండరినాథ్ కేసు విషయంలో అవగాహన లేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో భూకబ్జాలు ఎవరు చేస్తున్నారో ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసునన్నారు.
పెద్దశంకరంపేటలో ఒక బీసీ నాయకుడి ఎదుగుతున్న తీరును చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ఓర్వలేకే తమతో పాటు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు బురదజల్లుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో పెద్దశంకరంపేట సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మిరమేష్, ఎంపీటీసీలు వీణా సుభాష్ గౌడ్, స్వప్న రాజేశ్వర్, దత్తు దామోదర్, ఉపసర్పంచ్ దశరథ్, నాయకులు వేణుగోపాల్ గౌడ్, సురేష్ గౌడ్, ఆర్యన్ సంతోష్ కుమార్, పున్నయ్య పాల్గొన్నారు.