Breaking News

ధరణి తెచ్చిన కష్టాలు

ధరణి తెచ్చిన కష్టాలు

  • రాణిశంకరమ్మ ఇనాం భూములపై వివాదం
  • వందేళ్లుగా కాస్తులో టెంకటి గ్రామపేద రైతులు
  • ఓ‌ఆర్‌సీ తీసుకోకపోవడంతో రాణివారసులకు హక్కు
  • హక్కుదారులుగా పరిగణిస్తూ.. పట్టాబుక్కులు జారీ
  • ఇటీవల అమ్ముకోవడంతో వెలుగులోకి భూవివాదం
  • న్యాయం చేయాలని కోరుతున్న పేద రైతులు

వంద ఏళ్లుగా దున్నుకొని బతుకుతున్న పేదల ఈనాం భూములపై కొందరి కన్నుపడింది. గుంట, రెండు గుంటల చొప్పున సాగుచేసుకుని జీవనోపాధి పొందుతున్న బక్క జీవుల బతుకుల్లో ధరణి మట్టికొట్టింది. ఈ భూములు తమవే అనుకున్న సాగుదారులు ఓఆర్సీ తీసుకోలేదు. దీంతో ఆ భూములు రాణిశంకరమ్మ వారసులుగా భావిస్తున్న కొందరికి పట్టా అయ్యాయి. ఇప్పుడు వారు వాటిని అమ్ముకోవడంతో సాగుదారులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట సంస్థానం రాణిశంకరమ్మ అధీనంలో ఉండేది. ఈ సంస్థానానికి మండలంలోని చాలా గ్రామాల్లో వందల ఎకరాల ఇనాం భూములు ఉన్నాయి. వీటన్నిటింని అప్పట్లోనే రాణిశంకరమ్మ కుటుంబీకులు, వారసులు ఆయా గ్రామాల్లో వారికి నమ్మకమైన వ్యక్తులకు ఇనాం కింద ఇచ్చేశారు. పెద్దశంకరంపేట మండలంలోని టెంకటి గ్రామ సర్వేనం.70, 72, 81, 82, 22, 18లో 70 ఎకరాల ఇనాం భూమి ఉంది. 1954 ఖాస్రాపహాణీలో ఈ భూములకు రాజాదుర్గారెడ్డి దేశాయి ఇనాందారుగా ఉన్నారు. ఆ తర్వాత 1973లో ఇనాం చట్టం రద్దుకావడంతో ఈ భూములన్నీ మళ్లీ రాణిశంకరమ్మ పేరు మీదకు మారాయి. 150 మంది రైతులు కాస్తులో ఉండగా కేవలం 27 మంది రైతులకు వారి పేరు మీద ఓ‌ఆర్‌సీ(అక్యూపై రైతు సర్టిఫికెట్) లు ఇచ్చి కొత్త పట్టా పాసు బుక్కులు అందజేశారు. మిగతా భూములు రాణిశంకరమ్మ పేరనే రుపైనే ఉండిపోయాయి. 2011-12 పహాణీ రికార్డుల్లో మాత్రం 150 మంది సాగుచేసుకుంటున్నట్లు నమోదైంది. ‘మేం మా వారసుల నుంచి కబ్జాలో ఉన్నాం.. ఈ భూములు మాకు సంబంధించినవే’ అన్న నిర్లక్ష్య ధోరణిలో చాలా మంది రైతులు ఉన్నారు. ఇదే వారికి శాపంగా మారింది.

పేదలకు పంపిణీచేసిన రాణిశంకరమ్మ ఇనాం భూములు

ధరణితో సమస్య వెలుగులోకి..
ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి చట్టం అసలు కష్టాలను తెచ్చిపెట్టింది. రాణిశంకరమ్మ పేరుతో ఉన్న భూములను అధికారులు ఆమె వారసుల పేర్ల మీద రికార్డుల్లో నమోదు చేశారు. అంతేకాదు వారికి పట్టా బుక్కులను కూడా ఇచ్చేశారు. దీంతో కొందరు వారికి లభించిన పట్టాల ఆధారంగా భూములను ఇతరులకు అమ్ముకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తమకు తొందరగా ఓ‌ఆర్‌సీ ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో భూములను కొనుగోలు చేసిన వ్యక్తులు తమకు సర్వే చేసి తమ భూమి ఎక్కడుందో చూపించాలని, గ్రామానికి చేరుకొని సర్వే కోసం భూముల వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆ భూముల్లో కాస్తులో ఉన్న రైతులు వారికి ఎదురు తిరిగారు. ఈ నేపథ్యలంలో కొనుగోలుదారులు రిషి అగర్వాల్, నవీన్ జైన్, పండరి పెద్దశంకరంపేట పోలీస్​స్టేషన్ లో రైతులపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 23 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఇలా మధ్యలో లాక్కుంటే తమ పరిస్థితి ఏమిటని బాధిత రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఓ‌ఆర్‌సీలు తీసుకోకపోవడంతో సమస్య
1973-74లో కాస్తులో ఉన్న రైతులు ఓ‌ఆర్‌సీలు తీసుకోకపోవడంతోనే ఈ ఇబ్బందులు తలెత్తాయి. అవగాహన లేకపోవంతో రైతులు కూడా వీటిపై శ్రద్ధచూపించలేదు. దీంతో రాణిశంకరమ్మ వారసులు ఈ భూములను అమ్ముకున్నారు. ఈ భూముల వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులకు కూడా నివేదించాం.
:: చరణ్ సింగ్, ఇన్​చార్జ్​తహసీల్దార్, పెద్దశంకరంపేట

భూములు తీసుకుంటే చావే శరణ్యం
మా తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన ఈ భూములను తీసుకుంటే మాకు ఊరి తాడే దిక్కు. రెవెన్యూ అధికారులు కాస్తులో ఎవరు ఉన్నారో గుర్తించి మా భూములు మాకు ఇప్పించాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలి.
:: కుమార్, రైతు, టెంకటి

బొంద పెట్టడానికి అవే భూములు
అవి మా తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన ఈనాం భూములు. ఎక్కడి నుంచో వచ్చి మాపై దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులు కూడా వారికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మాకు అన్యాయం చేయొద్దు. మాకు బొంద పెట్టడానికి కూడా అదే స్థలం ఉంది.
:: నర్సిములు, రైతు, టెంకటి