- మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
- తెలంగాణ ఉర్దూ జాబ్ ఫెయిర్ బ్రోచర్ విడుదల
సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి, సామరస్యాలను కాపాడేందుకు ముస్లింల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి సీఎం కేసీఆర్చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సమాజంలోని అన్నివర్గాల వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జనవరి 6న గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసే ‘ఫస్ట్ ఉర్దూ జాబ్ ఫెయిర్ ఆఫ్ తెలంగాణ’బ్రోచర్ ను శనివారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉర్దూ భాషాభివృద్ధి, వికాసానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ ఉర్దూ భాషాభిమాని అని, తెలుగు, ఇంగ్లిషులతో సహ ఉర్దూలో కూడా అనర్గళంగా మాట్లాడుతారని వివరించారు. ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడాన్ని, మంత్రుల పేషీల్లో ఉర్దూ వచ్చిన ఆఫీసర్లను నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉర్దూ అకాడమీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, సెట్విన్, యూత్ అడ్వాన్స్ మెంట్ కమిటీ, హైదరాబాద్ వీకర్స్ సెక్షన్ డెవలప్ మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ మొట్టమొదటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ యువతను కోరారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ గౌస్ మాట్లాడుతూ.. పెద్దఎత్తున జరిగే ఈ మేళాలో ప్రభుత్వ, ప్రైవేట్రంగాల్లోని టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు. 10వ తరగతి నుంచి పీజీ, ఐటీఐ, డిప్లామో, ప్రభుత్వ అనుమతి పొందిన మదర్సాల్లో చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన యువత పాల్గొనవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మహ్మద్ యూసఫ్ ఖాన్ (మౌలానా ఆజాద్ యూనివర్సిటీ), డాక్టర్ సయ్యద్ అస్గర్ మహ్మద్(అడ్వాన్స్ మెంట్ కమిటీ), చంద్రమౌళి (సెట్విన్ ), సెరికల్చర్ మాజీ అధికారి డాక్టర్ ఖాద్రీ, ప్రముఖ న్యాయవాది వలీ ఉర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.