- ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్
సామాజిక సారథి, మహబూబాబాబాద్: విద్యారంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఎస్ఎఫ్ఐ మానుకోట డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్యప్రకాష్ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం గూడూరు మండల కేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యా, వైద్యంరంగాలు మెరుగుపడతాయని అనుకుంటే విద్యావ్యవస్థను మొత్తం భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మేస్ ఛార్జీలు పెంచాలని, విద్యారంగానికి 30 శాతం బడ్జెట్ కేటాయించాలని కోరారు. కరోనా థర్డ్ వేవ్ కు ముందస్తు చర్యలు చేపట్టి విద్యాసంస్థలు, హాస్టళ్లలో శానిటేషన్ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్య విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. గూడూరు సంక్షేమ హాస్టల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, మెనూ పాటించని వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ మండలాధ్యక్షుడు గణేష్, మండల నాయకులు అఖిల్, సునీల్, నవీన్, విజయ్, కుమార్, సురేష్, కృష్ణ, మురళి పాల్గొన్నారు.