- ప్రాజెక్టుల నత్తనడన సాగడంపై
- కేంద్రమంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ ప్రాజెక్టులు నత్తనడకన సాగడంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల అమలులో జాప్యంతో తరచూ ప్రాజెక్టు వ్యయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదని, అయితే వ్యవస్థాగత లోటుపాట్లతోనే ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ యంత్రాంగంలో నిర్ణయ రాహిత్యం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యమే పెద్దసమస్యగా ముందుకొస్తోందని అన్నారు. శనివారం ఎస్‌సీఎల్ ఇండియా 2021 సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2025 వరకూ జాతీయ మౌలిక వసతుల కార్యక్రమం కింద భారీ కేటాయింపులతో దేశ ఆర్థిక వ్యవస్థలో కేంద్రం ఉత్తేజం నింపుతుందన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి సమకూరుస్తున్న నిర్మాణ రంగం జీడీపీకి ఊతమిస్తోందని చెప్పారు. దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, లోటుపాట్లను పరిష్కరించేందుకు తన నేతృత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన కమిటీ ప్రయత్నిస్తోందని నితిన్ గడ్కరీ అన్నారు.