Breaking News

రాజ్యాంగాన్ని గౌరవించాలి

రాజ్యాంగాన్ని గౌరవించాలి

  • భారత ఐక్యత పటిష్టతకు అదే పునాది
  • హక్కుల రక్షణకు విధులు తెలుసుకోవాలి
  • రాజ్యాంగ దినోత్సవంలో ప్రధాని మోడీ
  • పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వేడుకలు
  • ప్రసంగించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్​తదితరులు
  • ముంబై దాడుల్లో అమరులకు నివాళులు
  • బహిష్కరించిన కాంగ్రెస్‌, టీఎంసీ, బీఎస్పీతో సహా 12 ప్రతిపక్ష పార్టీలు

న్యూఢిల్లీ: మనం మన రాజ్యాంగాన్ని అక్షరబద్ధంగా, స్ఫూర్తితో పాటిస్తున్నామా.. అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించారు. మనం ఎటువైపు వెళ్తున్నామో, మన ప్రాధాన్యత ఏమిటి, దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నామో ఆలోచించుకోవాలని కోరారు. విభిన్నమైన మన దేశాన్ని మన రాజ్యాంగం ఏకీకృతం చేస్తుందన్నారు. ఎన్నో అవరోధాల తర్వాత రాజ్యాంగాన్ని రచించినట్లు గుర్తుచేశారు. శుక్రవారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. స్వతంత్రంగా ఉన్న రాష్ట్రాలను మన రాజ్యాంగం ఏకీకృతం చేసిందని గుర్తుచేశారు. రాజ్యాంగ దినోత్సవం రోజున మన పార్లమెంట్‌కు సెల్యూట్‌ చేయాలన్నారు. ఇక్కడే అనేక మంది నేతలు తమ మేథోమధనంతో రాజ్యాంగాన్ని రచించారని గుర్తుచేశారు. మహాత్మాగాంధీతో పాటు దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఎంతోమంది నేతలకు నివాళులర్పిస్తున్నట్లు ప్రకటించారు. 1950 తర్వాత ప్రతి ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాల్సి ఉండేదని, రాజ్యాంగ నిర్మాణంపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. మన హక్కుల రక్షణ కోసం మన విధులు ఏమిటో తెలుసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు.

కాంగ్రెస్.. పార్టీ బై ద ఫ్యామిలీ

కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ ఫర్‌ ద ఫ్యామిలీ.. పార్టీ బై ద ఫ్యామిలీ అన్నట్లుగా మారిందన్నారు. ఈ అంశంపై అంతకన్నా ఎక్కువగా చెప్పడం తనకు ఇబ్బందిగా ఉందన్నారు. ఒకే పార్టీ దేశాన్ని పాలించడం కానీ, ఒక పార్టీ వ్యవస్థ మొత్తం ఒకే కుటుంబం చేతుల్లో ఉండటం సరికాదన్నారు. ఒక జాతీయ పార్టీ తరతరాలు ఒకే కుటుంబం చేతుల్లో ఉంటే, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సమస్యగా మారుతుందని ఆయన అన్నారు. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. ఒక పార్టీని తరతరాలుగా ఒకే కుటుంబం ఏలితే ఆ పార్టీలో ఉన్న వ్యవస్థలన్నీ ఒకే కుటుంబం వద్ద ఉంటే, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకటంగా మారుతుందని ప్రధాని మోడీ కాంగ్రెస్​ను ఉద్దేశించి విమర్శించారు.

రాజ్యాంగం.. ఆధునిక భగవద్గీత

స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఆధునిక భగవద్గీత అన్నారు. దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు రాజ్యాంగం మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. ప్రతిఒక్కరూ దేశం కోసం పనిచేయాలని తపిస్తే అప్పుడు మనం ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌’ను నిర్మించవచ్చని తెలిపారు.

సాహస సైనికులకు ప్రధాని మోడీ నివాళి

ముంబైలో ఉగ్రదాడులు జరిగి నేటికి 14 ఏళ్లు అవుతోందని, ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన సాహస సైనికులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. 2008లో ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి వందలాది మంది అమాయక పౌరులను హతమార్చిన ఈరోజు 26/11 కూడా మనకు చాలా బాధాకరమైన రోజు అని గుర్తుచేశారు.

హాజరు కాని విపక్షాలు

రాజ్యాంగ దినోత్సవ సంబరాలకు విపక్షాలు డుమ్మాకొట్టాయి. 14 ప్రతిపక్షాలు పార్టీలు ఆ వేడుకలకు హాజరుకాలేదు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు పాల్గొనలేదు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని కాంగ్రెస్‌ నేత మాణిక్‌ ఠాకూర్‌ స్పష్టంచేశారు. సోమవారం నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని, 14 పార్టీలు నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే వెల్లడించారు.