- ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం సాధించారు
- తిరుగుబాటును అరికట్టడానికి వేరే విధానాలు
- ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల
న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల కోరారు. ఇదే అంశంపై ఆమె 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై పోలీసుల కాల్పుల నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనతోనైనా ప్రభుత్వం కళ్లుతెరవాలని సూచించారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం కారణంగా ప్రజలు అణచివేతకు గురవుతున్నారని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మండిపడ్డారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. ప్రజల ప్రాణాలు పోతుంటే ఈ చట్టాలు ఎందుకని ప్రశ్నించారు. ఈ చట్టం కారణంగా ఈశాన్య ప్రాంత ప్రజలు ఇంకా ఎన్నిరోజులు బాధలు పడాలని నిలదీశారు. తిరుగుబాటు నెపంతో మీరు ప్రజల కనీస హక్కులను హరించలేరని, తిరుగుబాటును అరికట్టడానికి వేరే విధానాలు ఉన్నాయని హితవుపలికారు. చట్టాన్ని తెచ్చిన నాటి నుంచి ఏమైనా సాధించామా? అని ప్రశ్నించారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని రద్దుచేయడంపై దృష్టి సారించాలని ఉక్కు మహిళ కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏళ్ల నుంచి మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్నారని, మరి అక్కడ ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు.
సాధారణ పౌరులపై కాల్పులు
నాగాలాండ్- మయన్మార్ సరిహద్దుల్లో మోన్ జిల్లాలో ఈనెల 5న మిలిటెంట్లుగా భావించి ట్రక్కులో ప్రయాణిస్తున్న పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఓటింగ్ గ్రామానికి మొత్తం 14 మంది పౌరులు మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ జవాన్సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఉదంతం పార్లమెంట్‌ను సైతం కుదిపివేసింది. తప్పిదం జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.ఐదులక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల పరిహారం అందిస్తామని తెలిపింది. అయితే కాల్పులకు తెగబడ్డ కమాండోలను న్యాయపరంగా శిక్షించాలని ఓటింగ్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ పరిహారం తీసుకోబోమని వెల్లడించారు.