- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
సామాజిక సారథి, సిద్దిపేట: సీఎం కేసీఆర్ చేసిన అప్పులు తీర్చాలంటే పదేళ్లయినా సరిపోవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల దీక్షకు సోమవారం వారు మద్దతు తెలిపి మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజీనిచ్చి పనులు ప్రారంభించాలన్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు కట్టించినట్లే, నిర్వాసితుల కుటుంబాలకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన ప్రాంతాలకు ప్రభుత్వమే స్థలం సేకరించి ఆ గ్రామాలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. గౌరవెల్లి పంపు గ్రామాలకు ప్రభుత్వమే 100ఎకరాల భూమి సేకరించి గ్రామాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలన్నారు. మిడ్ మానేరులో భూమి కోల్పోయిన కేసీఆర్ సడ్డకుడు కుమారుడు సంతోష్ రావు, అత్తగారింటికెళ్లినా వాళ్ళచెల్లికి సైతం పరిహారం ఇప్పించిన కేసీఆర్ అసలైన నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇప్పించ లేకపోతున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూనిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.