Breaking News

తెలుగు వర్సిటీ పురస్కారాలు

తెలుగు వర్సిటీ పురస్కారాలు
  • కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణ ఎంపిక
  • 12న అందించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సామాజిక సారథి, హైదరాబాద్‌: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాలను శనివారం ప్రకటించింది. రెండేళ్ల కాలానికి ఇద్దరిని ఎంపిక చేశారు. 2018, 2019 సంవత్సరాలకు గాను కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణను పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ నెల 12న హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయం ఎన్‌టీఆర్‌ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు. పురస్కారంగా ఒక్కొక్కరికి రూ.లక్ష నగదుతో పాటు ప్రశంసాపత్రం అందించనున్నారు. డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య సాహిత్యంతో ఎనలేని సేవలందించారు. కవిగా, విమర్శకునిగా, ఉపాధ్యాయుడిగా.. సాహిత్యం, విద్యావ్యాప్తికి ఎంతో సేవ చేయడంతో పాటు ఎంతో మందిని కవులుగా, రచయిలుగా తీర్చిదిద్దిన ఆయనకు తెలుగు యూనివర్సిటీ 2018 సంవత్సరానికి గాను విశిష్ట పురస్కారాన్ని ప్రకటించింది. విఠలాచార్య 1938లో యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో జన్మించారు. కవిగా 22 పుస్తకాలను వెలువరించారు. పదవీ విరమణ అనంతరం తన స్వగ్రామంలోని తన గృహంలో సుమారు రెండు లక్షల గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. కూచిపూడి, ఆంధ్రనాట్యంలో గురువుగా, నర్తకునిగా విశేష సేవలందించిన కళాకృష్ణకు 2019 సంవత్సరానికి విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాన్ని ప్రకటించింది. 1951లో కరీంనగర్‌ జిల్లాలో జన్మించిన కళాకృష్ణ డాక్టర్‌ నటరాజ రామకృష్ణ వద్ద ఆంధ్రనాట్యాన్ని అభ్యసించారు. భరతనాట్యం, కూచిపూడి నాట్య శైలుల్లో కూడా శిక్షణ పొందారు. ‘నవజనార్ధన పారిజాతం’ ప్రదర్శించడంలో కళాకృష్ణ తనదైన రసజ్ఞ మోహనమైన ముద్రవేశారు. సత్యభామ పాత్రలో అపూర్వమైన అభినయానికి మెచ్చి కళాభిమానులు ఆయనను ‘అభినవ సత్యభామ’ అని ప్రశంసించారు. కళాకారుడిగా, అధ్యాపకుడిగా 45 ఏళ్లుగా సేవలందిస్తూ వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.