Breaking News

రైతులను ఆదుకోండి

రైతులను ఆదుకోండి
  • రాష్ట్రాన్ని కలవరపెడుతున్న ఆత్మహత్యలు
  • సీఎం కేసీఆర్​కు టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి లేఖ

సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలతో మరణమృదంగం మోగుతోందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వరి, మిర్చి రైతుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తామర పురుగు తెగులుతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారని వివరించారు. పంటను నష్టపోవడంతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని తెలిపారు. రైతుల ప్రాణాలంటే కేసీఆర్‌ ప్రభుత్వానికి గడ్డిపోచతో సమానంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. రోజూ పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతుపై వానకురిసిన చందంగా ప్రభుత్వం తీరు ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంట నష్టపోయిన మిర్చి రైతులకు తక్షణం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. మిర్చిరైతుల్లో భరోసా నింపేందుకు తక్షణం మంత్రుల బృందం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని కోరారు. రూ.లక్ష రుణమాఫీని తక్షణం అమలు చేయాలని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు.