Breaking News

సుభానీ నీకు ఏం తెలివి..!

సుభానీ నీకు ఏం తెలివి..!

సారథి న్యూస్​, మక్తల్​: షేర్ మార్కెట్ బూచి చూపి జనాన్ని దోచుకున్న షేక్ మహబూబ్ సుభానీ తాను కూడా దోపిడీకి గురయ్యాడు. షేర్​మార్కెట్ ​పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి ఉడాయించినట్లు డిపాజిట్​ దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏజెంట్లుగా పోలీసులు, విలేకరులు, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లను పెట్టుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన షేక్​ మహబూబ్​ సుభానీ ఏడాది క్రితం మక్తల్​కు వచ్చి స్థిరపడ్డాడు. ప్రజలను నమ్మించడానికి రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యాపారులతో తిరిగేవాడు. ‘నువ్వు జనాన్ని మోసం చేస్తున్నావు… మాకు కూడా కమీషన్ ఇవ్వాలి’ అంటూ కొందరు రాజకీయ నాయకులు, పెద్ద మనుషులు సుభానీని బెదిరించారని తెలిసింది. భయపడి ఆయన వారికి కూడా తాను దోచుకున్న సొమ్ములో వాటా పంచేవాడని సమాచారం.

షేక్ మహబూబ్ సుభానీ రాసుకున్న బాండ్​ పేపర్​, ప్రాంసరీ నోటు

నెలకు కొంత చొప్పున ముట్టజెప్పేవాడని అంటున్నారు. ఇందులో పోలీసులు, విలేకరులు కూడా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మక్తల్, మాగనూరు, కృష్ణ, ఉట్కూర్ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రియల్ ఎస్టేట్​ వ్యాపారులు, బ్రోకర్లకు వ్యవసాయ భూములు, ప్లాట్లు, డబ్బు ఇచ్చి స్టాంపు పేపర్​పై రాయించుకున్నాడని తెలిసింది. అవి అమ్మడానికి కరోనా నిబంధనల అడ్డొస్తాయని చెప్పి తప్పించుకున్నట్లు సమాచారం. 45 రోజుల క్రితం కొత్త స్కీం ప్రారంభించి, రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి కాలపరిమితి తీరాక రెండు తులాల బంగారం, రూ.నాలుగు వేల వడ్డీ చెల్లిస్తానని ప్రచారం చేసుకోవడంతో వందలాది మంది ఇందులో చేరినట్టు సమాచారం. తీరా మోసపోయామని తెలిసి మక్తల్​పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు షేక్​ సుభానీని ప్రత్యేక బృందాలతో పట్టుకునేందుకు గాలిస్తున్నారు.