Breaking News

బ్యాంక్ సేవలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డీఎం కౌశల్ పాండే
సామాజిక సారథి, నాగర్ కర్నూల్.:
బ్యాంక్ లు అందిస్తున్న సేవలపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డీఎం కౌశల్ పాండే అన్నారు. గురువారం బిజినపల్లి మండల కేంద్రంలోని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బ్యాంక్ లు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయన్నారు. మైనర్ స్టూడెంట్లకు బ్యాంక్ లు ఎలాంటి డిపాజిట్ అమౌంట్ లేకుండా జీరో అకౌంట్ ను అందిస్తున్నాయన్నారు. ప్రతి విద్యార్థి బ్యాంక్ అకౌంట్ల గురించి, బ్యాంక్ లు అందిస్తున్న సేవల గురించి తప్పక అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి విదేశాల్లో చదువుకునే ఉన్నత స్థాయి విద్యార్థుల వరకు వివిధ రకాల రుణాలు, ఇతర సేవలను బ్యాంక్ లు అందిస్తున్నాయన్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అరచేతిలోనే బ్యాంక్ సేవలు లభ్యమవుతున్నాయని ఇలాంటి సేవల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైబర్ నేరాల భారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ బ్యాంక్ అధికారి కూడా ఖాతాదారుల వ్యక్తి గత వివరాలు, ఏటీఎం ఫిన్ నెంబర్లు, మొబైల్ ఓటీపీ లను అడగరని డబ్బులు కాజేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ కు, మెసేజ్ లకు స్పందించవద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ సందీప్ కిరణ్, మండల ఎంఈఓ భాస్కర్ రెడ్డి, జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు , బిజినపల్లి ఎస్సై నాగ శేఖర్ రెడ్డి, లక్ష్మీ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.