- కొరవడిన మొయింటనెన్స్
- డీజిల్ పోయించుకోలేని పరిస్థితి
- కొన్ని జిల్లాల్లో నిలిచిపోయిన సేవలు
- మొదట 45 రకాల మందులు.. ప్రస్తుతం నాలుగైదు గోలీలతోనే సరి
- సకాలంలో అందని వేతనాలు
- ఉద్యోగుల సర్దుబాటుకు చర్యలు
- రాష్ట్రవ్యాప్తంగా 1,250 మంది సిబ్బంది
సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య సేవలందిస్తున్న 104 అంబులెన్స్‌లు త్వరలోనే నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ఎవరిని ఎక్కడ.. ఎలా పంపించాలో ఆ దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే తమను సర్దుబాటు చేయకుండా అంబులెన్స్‌లను రద్దుచేస్తే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పల్లెల్లో తాత్కాలిక వైద్యసేవలకు ఇబ్బంది కలుగుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 104 అంబులెన్సు సేవలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 198 అంబులెన్సులను ఏర్పాటుచేశారు. అందులో 1,250 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో ఏఎన్‌ఎం, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ అసిస్టెంట్, అంబులెన్స్ డ్రైవర్‌ను నియమించారు. అంబులెన్స్‌లో సిబ్బంది ప్రతి 20రోజులకు ఒకసారి గ్రామాలకు వెళ్లి దీర్ఘకాలిక రోగులకు టెస్టులు చేసి మందులు అందిస్తారు. మారుమూల పల్లెల్లో బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారికి స్థానికంగానే వైద్యసేవలు అందిస్తున్నారు.
సేవలకు అంతరాయం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం 104 అంబులెన్స్‌లపై నిర్లక్ష్యం చూపిస్తూ వచ్చింది. ఏటా నిధుల కేటాయింపులో కోత విధించింది. ఈ అంబులెన్స్‌ల మొయింటనెన్స్‌తో పాటు డీజిల్‌కు సైతం డబ్బుల్లేక నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 26 అంబులెన్సు ఉండగా, అందులో 152మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 8 అంబులెన్స్‌లు డీజిల్ లేని కారణంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ అంబులెన్స్ వాహనాల్లో మొదట 45 రకాల మందులు అందించేవారు. ప్రస్తుతం నాలుగైదు రకాల గోలీలు మాత్రమే ఇస్తున్నారు. ఈ మందులు కూడా సరిగా రాకపోవడం వల్ల వైద్యసేవలు అందడం లేదు. ఈ అంబులెన్సులో పనిచేసే సిబ్బందికి ప్రతినెలా వేతనాలు అందడం లేదు.
ఉద్యోగుల సర్దుబాటు
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,250 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. గతంలో కొంత మందిని పీహెచ్‌సీ, సబ్ సెంటర్లకు డిప్యూటేషన్‌పై పంపించారు. అప్పటి నుంచి అంబులెన్స్‌లు గ్రామాలకు వచ్చిన సందర్భంలో 104సిబ్బందితో కలిసి ఏఎన్‌ఎంలు సేవలందిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని పల్లె దవాఖానాలు, పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్దుబాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు మౌఖికంగా పేర్కొన్నప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. సిబ్బంది వేతనాల కోసం మార్చి వరకు బడ్జెట్ ఉందని అధికారులు పేర్కొంటున్నా.. ఆ తర్వాత ఉద్యోగులను సర్దుబాటు చేస్తారా..? లేదా? అన్నది వారిలో ఆందోళన నెలకొన్నది.