Breaking News

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

**రాజీమార్గంతో కేసుల శాశ్వత పరిష్కారం

**పైకోర్టుల్లో అప్పీలు లేకుండా కేసుల పరిష్కారానికి అవకాశం -జిల్లా జడ్జి డి.రాజేష్ బాబు

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: …. న్యాయానికి గొప్ప, పేద అన్న తేడా లేదు. ఏ పౌరుడూ ఆర్థిక, మరే ఇతర కారణాల వల్ల న్యాయం పొందే అవకాశాలు కోల్పోరాదన్న ఉద్దేశంతో.. పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించాలని భారత అత్యున్నత న్యాయస్థానం భావించి లోక్ అదాలత్ ను ప్రవేశపెట్టింది.ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసులను సత్వరమే పరిష్కరించటానికి లోక్‌ అదాలత్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో కక్షిదారుల ఆమోదంతో రాజీకుదిర్చి ఇరువర్గాలకు న్యాయం జరిగేలా పరిష్కార మార్గాలు చూపుతారు. లోక్‌ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవడానికి వీలులేని విధంగా పరిష్కారం చూపుతారు. దీంతో లోక్‌ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా వేలాది కేసులు (దావాలు) పరిష్కారమవుతున్నాయి. వివిధ కేసుల్లో బాధితులు, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆర్థికంగా నష్టపోకుండా లోక్‌ అదాలత్‌లో పరిష్కారం లభిస్తుంది. సత్వర న్యాయం కూడా లభిస్తుంది. ఏండ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో కేసులు లోక్‌ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా పరిష్కారమవుతున్నాయి. ఇరువర్గాలకు రాజీకుదిర్చి, ఇద్దరికీ సమ్మతమైన న్యాయాన్ని అందిస్తున్నారు. లోక్‌ అదాలత్‌లో మోటారు వెహికిల్‌ యాక్టుల్లోనూ, ఆబ్కారీ (ఎక్సైజ్‌) కేసులు, బ్యాంకు రుణాలు, కుటుంబ తగదాల కేసులు, ఇలా పలు కేసులు పరిష్కరిస్తున్నారు. సెప్టెంబర్ 9న జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకునే అవకాశం ఉందని నాగర్ కర్నూలు జిల్లా జడ్జి, చైర్మన్ డి.రాజేష్ బాబు తెలిపారు. లోక్‌ అదాలత్‌ గురించి ఆయన పలు విషయాలు తెలియజేశారు.*లోక్‌ అదాలత్‌ అంటే ఏమిటీ..?*రాజీ పడదగ్గ కేసుల్లో బాధితులు, ముద్దాయిలు ఇరువర్గాలు రాజీ పడదలచినచో వారు కోర్టుకు వచ్చి సెప్టెంబర్ 9న రాజీ చేసుకోవచ్చు. ఇరువర్గాలను రాజీకుదిర్చి సత్వర న్యాయం చేయడమే లోక్‌ అదాలత్‌ లక్ష్యం. ఇందులో పరిష్కరించిన కేసులపై పైకోర్టులో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదు.లోక్‌ అదాలత్‌లో ఏఏ కేసులు*రాజీ పడొచ్చు…?*కొట్లాట, దొంగతనం, చీటింగ్‌, అసభ్య పదజాలం, అతిక్రమణ, వ్యభిచారం, పరువునష్టం, బెదిరింపు, భార్యాభర్తల గొడవలు, మెయింటనెన్స్‌ క్రిమినల్‌ కంపౌండబుల్‌ కేసులు, ప్రీ-లిటిగేషన్‌ , టెలిఫోన్‌, బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులు రాజీపడొచ్చు.*లోక్‌ అదాలత్‌ ప్రయోజనాలు ఏమిటీ..?*కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయం వృథా చేసుకోవడం తప్పుతుంది. సమయం, డబ్బుల ఖర్చు కలిసివస్తాయి. కోర్టు ఫీజు లేకుండా ఇరువర్గాలు సంతోషపడే విధంగా రాజీ కుదుర్చుకోవచ్చు. సత్వర న్యాయం లభిస్తుంది. ఇరువర్గాలకు మేలు జరుగుతుంది. కోర్టు ఫీజు తిరిగి ఇస్తారు. లోక్‌ అదాలత్‌ కేసులకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప సాధారణంగా అప్పీలు ఉండదు.*ఎవరిని సంప్రదించాలి..?*సంబంధిత న్యాయవాది, పోలీసు అధికారి, మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులను సంప్రదించవచ్చు. నాగర్ కర్నూల్ పరిధిలో జిల్లా కోర్టు లోక్ అదాలత్ సభ్యులు బి రామచంద్రర్ 8074147825, సంపత్ కుమార్ 9985, బాబు పియర్స్ 9440394894,సి. లక్ష్మయ్య 9440190167, బంగారయ్య గౌడ్,8523861368 సంప్రదించాలి.*న్యాయసేవా అధికార సంస్థ అంటే ఏమిటీ..?*పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం అందించే ఏర్పాట్లను న్యాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. డబ్బున్నా , లేకపోయినా అందరికీ సరైనా న్యాయం అందించడానికి సుప్రీంకోర్టు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో న్యాయసేవా అధికార సంస్థలను అందుబాటులోకి తెచ్చింది. న్యాయసేవా అధికార సంస్థ ద్వారా పేదలు ఉచితంగా న్యాయసేవలు పొందవచ్చు. ఈ సేవలను పేదలు వినియోగించుకోవాలి.*లోక్‌ అదాలత్‌ ఎప్పుడు నిర్వహిస్తారు..?*ఈనెల సెప్టెంబర్ 9న సుప్రీంకోర్టు , హైకోర్టు ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా జడ్జి డి రాజేష్ బాబుఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ కొల్లాపూర్ కల్వకుర్తి అచ్చంపేట అన్ని కోర్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు కాంప్లెక్స్‌లో, జూనియర్‌ సివిల్‌ కోర్టుల్లో రాజీ పడదగ్గ కేసులన్నీ రాజీ చేయబడును.*లోక్ అదాలత్ ద్వారా ఇప్పటివరకు 7321 కేసుల శాశ్వత పరిష్కారం*నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా జూన్ నాటికి నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 7,321 కేసుల శాశ్వత పరిష్కారం చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 14,536 పెండింగ్ కేసులను పరిష్కరించాలని లక్ష్యంతో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామం.కక్షిదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.