సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వీఆర్‌ఎస్ తీసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిస్తానని సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ కావడంతో ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పంపించగా ఆయన ఆమోదించారు. ఇదిలాఉండగా, కొద్దిసేపటల్లో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. 1996లో డిప్యూటీ కలెక్టర్ కేడర్‌లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బందర్, తిరుపతి, చిత్తూరు ఆర్డీవోలుగా పనిచేశారు. 2007లో ఐఏఎస్‌గా ప్రమోషన్ పొందిన ఆయన మెదక్ జిల్లా డ్వామా పీడీగా, హుడా సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా, మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం సిద్దిపేట కలెక్టర్ గా కొనసాగుతున్నారు. జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు. మలన్నసాగర్, రంగనాయక్ సాగర్ లాంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనూ కీలకభూమిక పోషించారు. సిద్దిపేట సమీకృత కలెక్టర్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొనే క్రమంలో కాళ్లు మొక్కుతూ బ్యూరోక్రాట్‌గా విమర్శల పాలయ్యారు. టీఆర్ఎస్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారంటూ పలు సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. వారి మాటలను నిజం చేస్తూ ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాజీనామా ఆమోదం అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోంది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు. ఈ అభివృద్ధి మార్గంలో సీఎంతో ఉండాలనుకొని వీఆర్‌ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. రానున్న వంద సంవత్సరాలు తెలంగాణ గురించి ప్రజలు చెప్పుకొనే విధంగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు వచ్చాక టీఆర్ఎస్లో చేరుతాను. సీఎం మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తాను’’ అని పేర్కొన్నారు.