- దేశానికి మోడీ, రాష్ట్రానికి కేసీఆర్ప్రమాదకరం
- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజం
- ఘనంగా కాంగ్రెస్పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం
సామాజికసారథి, హైదరాబాద్: దేశానికి కాంగ్రెస్పార్టీ దిశానిర్దేశం చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శాంతియుత పోరాటంతో ఏదైనా సాధించవచ్చనని స్వాతంత్య్ర సంగ్రామం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిందని కొనియాడారు. అలీన విధానం, హరితవిప్లవం, పారిశ్రామిక విప్లవం, ఫుడ్ సెక్యురిటీ సిస్టం, ఉపాధిహామీ పథకం, సాంకేతిక అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమైందన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో 137వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ జెండాను టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పుట్టిందన్నారు. కొంతమంది కుహనావాదులు కాంగ్రెస్ గురించి అవగాహన లేక అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. మతసామరస్యం, శాంతి సమరస్యాలతో దేశంలో ప్రాజెక్టులు నిర్మించి బీడుభూముల్లో బంగారం పండించిన గొప్ప ఘనత కాంగ్రెస్పార్టీకే ఉందన్నారు. దేశంలో మళ్లీ పూర్వవైభవం రావాలంటే దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ప్రధాని మోడీకి కుటుంబం లేదు, పిల్లలు లేరు, ఆయనకు ఏం తెలుసునని విమర్శించారు. ఇప్పుడు ఆడ పిల్లలకు పెళ్లి వయస్సు పెంచి దేశంలో ఒక అలజడి సృష్టించారని అన్నారు. పార్లమెంట్‌లో 80 మంది కంటే ఎక్కువ మంది మహిళలు లేరని, పెళ్లి ఎప్పుడు చేసుకోవాలన్నది ఆడ బిడ్డల అభిప్రాయమని చెప్పారు. హడావుడి నిర్ణయం సరికాదన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని బీజేపీని విమర్శించారు. దేశానికి మంచి రోజులు రావాలంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. దేశానికి మోడీ, తెలంగాణ రాష్ట్రాన్రికి కేసీఆర్ నాయకత్వం ప్రమాదకరమని ఆయన విమర్శించారు. కార్యక్రమానికి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, మధుయాష్కీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీఎంపీ మల్లు రవి, కోదండారెడ్డి, కుసుమ కుమార్, మాజీఎమ్మెల్యే పద్మావతి, సేవాదళ్ చైర్మన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.