సారథి, సిద్దిపేట, కరీంనగర్ ప్రతినిధి: ఆయన ఓ గ్రామానికి కార్యదర్శి కానీ కరోనాతో బాధపడుతున్న గ్రామస్తులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని గునుకులపల్లిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. గ్రామంలో సుపరిపాలన సాగాలని గ్రామ ప్రథమ పౌరుడితో ఆ గ్రామ సెక్రటరీ శ్రావణ్ కదం తొక్కుతూ గ్రామస్తులతో మమేకమవుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభించకుండా అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ రైతు కటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. భయంతో గ్రామస్తులు ఆ ఇంటివైపు కన్నెత్తి చూడకపొవడంతో ప్రతిరోజు ఆ కుటుంబసభ్యులకు నిత్యవసర వస్తులు, కూరగాయలు, పాలు, కోడిగుడ్లు, తాగడానికి మినరల్ వాటర్ ను తనే స్వయంగా వెళ్లి అందజేస్తూ ఆ కుటుంబసభ్యుల్లో మనోధైర్యం నింపుతున్నారు.
అలాగే ఆ రైతుకు చెందిన పాడిగేదెలు, ఏడ్లకు ప్రతిరోజు మేత వేయడం, రెండుసార్లు నీళ్లు తాగించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను అన్నీ తానై చూస్తున్నారు. కరోనా వచ్చిన కుటుంబసభ్యుల ఇంటి చుట్టూ సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించి ఏదైనా సమస్య వస్తే తనకు ఫోన్ చేయాలని, తానెప్పుడు గ్రామంలోనే ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. కరోనా బారినపడిన ఆ కుటుంబానికి గ్రామ కార్యదర్శి శ్రావణ్ చేస్తున్న మంచి పనికి ‘శభాష్ కార్యదర్శి’ అని గ్రామస్తులు, యువకులు, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.