- యువకుడి సేవాస్ఫూర్తి
- సొంత ఖర్చుతో రోడ్డుపై గుంతల పూడ్చివేత
- అభినందన తెలిపిన వాహనదారులు
సామాజిక సారథి, వర్ధన్నపేట: నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నతాధికారులు వెళ్లే జాతీయ రహదారి అది. ప్రతిరోజూ వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన మార్గం. ఆ హైవేపై గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారాయి. ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలాల్లేవ్. ఎవరూ బాధ్యతగా ముందుకొచ్చి ఆ గుంతలను పూడ్చే ప్రయత్నమూ చేయలేదు. కానీ ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన బర్ల శివ తన సొంతఖర్చుతో ఆ గుంతలను పూడ్చి సేవాగుణాన్ని, సామాజిక బాధ్యతను చాటుకున్నాడు. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆదివారం ఇల్లంద నుంచి వర్ధన్నపేట బస్టాండ్ వరకు రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను తన పార్టీ కార్యకర్తలు, మిత్ర బృందంతో కలిసి పూడ్చివేశాడు. ప్రస్తుతం బర్ల శివ జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ‘హైవేపై గుంతల వల్ల ప్రయాణికుల పడుతున్న ఇబ్బందులు చూసినప్పుడు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ స్పూర్తితోనే ఎలాగైనా వాటిని మరమ్మతులు చేయాలని నిర్ణయించుకున్నాను. తాను బైక్కొనాలని దాచుకున్న డబ్బుతో కంకర, డస్ట్ తీసుకొచ్చి గుంతలను పూడ్చివేశాను’ అని చెప్పుకొచ్చారు. కార్యక్రమానికి కోరిన వెంటనే సాయం కోసం కార్యకర్తలను పంపించిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్నేమురి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ఆకుల సుమన్ కు బర్ల శివ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన సైనికులు జె.సందీప్, బి.రాజ్ కుమార్, ఐ.దయాకర్, ఎస్ కే అజర్, వై.శ్రీకాంత్, సతీష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.