Breaking News

మురుగు.. పరుగు

మురుగు.. పరుగు
  • నాగర్​కర్నూల్ ​జిల్లాకేంద్రంలో డ్రైనేజీలు అస్తవ్యస్తం
  • గడువు దాటినా పూర్తి కాని యూజీడీ పనులు
  • వర్షాకాలంలో పట్టణవాసులకు తప్పని అవస్థలు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ ​కర్నూల్​జిల్లా కేంద్రంలో మురుగు నీటివ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొన్నేళ్లుగా కాల్వల నిర్మాణం జరగక, పాత వాటిని మరమ్మతు చేయకపోగా, వీధుల్లో నీరంతా నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. నిధులున్నా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పట్టణవాసులు వర్షాకాలంలో నరకం అనుభవిస్తున్నారు. రెండేళ్ల క్రితం పట్టణంలో రూ.65 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ (అండర్ గ్రౌండ్ ​డ్రైనేజీ) నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జూన్ నాటికి పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఆరునెలలు గడిచినా అండర్ గ్రౌండ్ ​డ్రైనేజీ పనులు పూర్తవడం లేదు. పైపులైన్​పనులు మాత్రం 90శాతం పూర్తికాగా, ప్రధానమైన ఎస్టీపీల నిర్మాణం పూర్తికాలేదు. అక్కడక్కడా వీధుల్లో పైపులైన్ పనులు పూర్తి కావాల్సి ఉంది.

మురుగుతో సమస్యలు ఇవే

పట్టణంలో ప్రస్తుతం 7,240కు పైగా నివాసాల్లో 37,147 మంది నివసిస్తున్నారు. జనాభా లెక్కల ప్రకారం ఒక్కో పౌరుడికి 100 లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. ఇందులో 75శాతం మురుగు నీరు ఇళ్ల నుంచి బయటకు వస్తుందని అంచనా. ఈ లెక్కన రోజుకు 1.8 మిలియన్ లీటర్ల మురుగు బయటకు వస్తుంది. ఇది బయటికి వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేదు. జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి పట్టణంలో క్రమంగా ఆవాసాలతో పాటు జనాభా పెరుగుతోంది. కానీ ఇందుకు అనుగుణంగా మురుగు పారుదల వ్యవస్థ ఏర్పాటు కాకపోవడంతో నీరు నిలిచి స్థానికులు రోగాల బారినపడుతున్నారు. పట్టణంలో దాదాపుగా అన్ని వార్డుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈదమ్మగుడి, గొల్లగేరి, సంత బజార్, సాదత్ నగర్, రాంనగర్, సంజయనగర్, ఎర్రగడ్డ, హౌసింగ్​బోర్డు, రెహత్ నగర్, ఓంనగర్, అంబేడ్కర్ కాలనీల్లో మురుగు వ్యవస్థ సరిగ్గాలేదు. 20 ఏళ్ల క్రితం హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మించిన భూగర్భ పైపులైన్లు పగిలి నీరంతా పారుతుండటంతో నిత్యం కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. బీసీ కాలనీ, ఎర్రగడ్డ, టీచర్స్ కాలనీ, భగీరథ కాలనీ, నాగనూల్ శివారు బీసీ కాలనీ ప్రాంతాల్లో మురుగు నీటి పారుదలకు సరైన నిర్మాణాల్లేవ్. దీంతో వర్షాకాలంలో ఆ నీరంతా కేసరిసముద్రం చెరువులో కలుస్తోంది. ప్రస్తుతం పట్టణానికి సరఫరా చేసే నీటిలో అధిక మొత్తం ఈ చెరువు పరిసరాల్లోని బోరుబావుల నుంచే సరఫరా అవుతోంది. 

పనులు చివరి దశలో ఉన్నాయి

మున్సిపాలిటీ భూగర్భ మురుగు నీటి వ్యవస్థ నిర్మాణం పూర్తయితేనే పట్టణంలో ఉన్న సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. ఆ నీటిని శుద్ధిచేసేందుకు పెరుగుతున్న జనాభా ప్రకారం రాబోయే 20 ఏళ్ల వరకు శుద్ధిచేయగలిగే 5.5 ఎంఎల్(మిలియన్ లీటర్లు) సామర్థ్యం గల సీవేజ్ ట్రీట్​మెంట్​ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. 2.3 ఎంఎల్ డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్​మెంట్​ప్లాంట్) 90శాతం మేర పనులు పూర్తయ్యాయి. 3.2 ఎంఎల్​డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్​మెంట్​ప్లాంట్)నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.

:: గోనె అన్వేష్, కమిషనర్, నాగర్ కర్నూల్

మొత్తం వార్డులు : 24

నాగర్​కర్నూల్​టౌన్​జనాభా : 37,147

జనావాసాలు: 7,240

నిత్యం వచ్చే మురుగు నీరు : 1.8 మిలియన్ లీటర్లు

యూజీడీ ఏర్పాటుచేస్తున్న వార్డులు: 19

యూజీడీకి నిధులు: రూ.65 కోట్లు

పైపులైన్: 100 కి.మీ.

శుద్ధికేంద్రాలు: 2

రోజూ శుద్ధిచేసే సామర్థ్యం : 5.5 ఎంఎల్