హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీపోస్టుల వివరాలను పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. ఆయా శాఖల్లోని ఖాళీ పోస్టుల సంఖ్య, వాటి హోదా, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలనుకుంటున్న పోస్టుల వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో పంపించాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టుల వివరాలు వద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ ను పెంచిన దృష్ట్యా ఖాళీపోస్టుల సంఖ్యలో తేడాలు ఏర్పడ్డాయి. ఆ మార్పులకు అనుగుణంగా లిస్టును తయారుచేసి పంపించాలని అన్ని శాఖలకు లేఖ రాశారు.
పూర్తి వివరాలు అందాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సీఎంతో చర్చించి అనుమతి లభించిన తర్వాత ఆర్థికశాఖ పరిశీలించి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తుంది. ఆ తర్వాతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే ప్రస్తుతం కమిషన్‌కు పూర్తిస్థాయి ఛైర్మన్, పాలకమండలి లేకపోవడంతో నోటిఫికేషన్ కు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.