- ఎస్పీ రమణ కుమార్
సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది చౌరస్తా వద్ద సోమవారం ఉదయం 6గంటలకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 600కిలోల ఎండు గంజాయిని స్వాధీన పర్చుకున్నామని జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్ పూర్తీ వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం తమకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పర్యవేక్షణలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఇనుప స్క్రాబ్ తో హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ(కేఏ 56 4144)ని తనిఖీ చేయగా అందులో రూ .40లక్షలకు పైగా విలువ చేసే 600కిలోల ఎండు గంజాయి సంచులు లభించాయన్నారు. నిందితులైన అనిల్ గోవింద్ కలిముక్లె, గణేష్ నందకిషోర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఎండు గంజాయి రవాణాకు ప్రధాన సూత్రధారి నారాయణఖేడ్ మండల్ ఎనక్ పల్లి గ్రామస్థుడైన అనిల్ రెడ్డి అని తెలిపారు. ఈ మేరకు లారీని, నిందితులను అదుపులోకి తీసుకొని విచరిస్తున్నామని ఎస్పీ తెలిపారు.