Breaking News

ఎక్కడున్నా అభివృద్ధిని చూస్తారు

రావత్ ఎక్కడున్నా అభివృద్ధిని చూస్తారు
  • ప్రధాని నరేంద్రమోడీ
  • ప్రతిష్టాత్మక సరయూ ప్రాజెక్టు ప్రారంభం

లక్నో: స్వర్గీయ సీడీఎస్​చీఫ్​జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఎక్కడ ఉన్నా రాబోయే రోజుల్లో భారత్‌ ముందుకెళ్తున్న తీరు, అభివృద్ధిని గమనిస్తూ ఉంటారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రావత్‌ మరణం ప్రతి దేశభక్తుడికి నష్టమే అన్నారు. ఆయన అత్యంత ధైర్యసాహాసాలు కలిగిన వ్యక్తి అని, దేశసైన్యాన్ని స్వయంవృద్ధి చేసేందుకు ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన పనితీరును దేశం ప్రత్యక్షంగా చూసిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ప్రతిష్టాత్మకమైన సరయూ నహర్‌ నేషనల్‌ ప్రాజెక్టును శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిసెంబర్‌ 8న జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన వీర సైనికుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. సానుభూతి ప్రకటించారు. అయోధ్యలో రామాలయం గురించి ప్రస్తావిస్తే.. మహారాజా పటేశ్వరి ప్రసాద్‌ సింగ్‌ సాహెబ్‌ గుర్తుకొస్తారని అన్నారు. బలరామ్‌పూర్‌ ప్రజలు మేధావులని, దేశానికి ఈ ప్రాంతం ఇద్దరు భారతరత్నాలను ఇచ్చిందని ప్రధాని గుర్తుచేశారు. నానాజీ దేశ్‌ముఖ్‌తో పాటు అటల్‌ బిహారీ వాజ్‌పేయి కూడా ఈ ప్రాంతానికి చెందినవారేనని అన్నారు. మిలిటరీలో ఉన్నంత కాలమే సైనికుడిలా ఉండిపోరని, వారి జీవితమంతా యోధులుగా ఉంటారని గుర్తుచేశారు. క్రమశిక్షణ కలిగి ఉంటారని, ఇది దేశానికి గర్వకారణమన్నారు. ఇప్పుడు యావత్‌ దేశం దుఖంలో ఉందని, ఎంత బాధ ఉన్నా మన ప్రగతిని మరవజాలమని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు.