Breaking News

సర్పంచ్​ బిల్లులు స్వాహా

వార్డు సభ్యుడిపై సర్పంచ్​ దాడి
  • పనులు చేసిన వార్డు సభ్యుడు పనులు
  • ప్రభుత్వం నుంచి పైసా రాక లబోదిబో

సామాజికసారథి, బిజినేపల్లి: ప్రభుత్వం నుంచి పని వచ్చిందని, మున్ముందు గ్రామానికి అవసరం వస్తుందని అప్పుచేసి మరీ పనులు చేశారు. బిల్లులు రాకపోతాయా..? అని చకచకా పూర్తిచేశారు. అభివృద్ధి పనులు చేసింది ఒకరైతే బిల్లులు తెచ్చుకున్నది మరొకరు.. తీరా అధికారుల వద్దకు వెళ్లి ఆరాతీస్తే అస​లు విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం రైతు వేదికలను మంజూరుచేసింది. నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ వార్డు సభ్యుడు ముందుగానే లక్షలాది రూపాయల అప్పుతెచ్చి మరీ రైతువేదిక కట్టారు. చివరికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు. చివరి ప్రయత్నంలో ఎస్టీవో ఆఫీసుకు వెళ్లి బిల్లుల ఆలస్యంపై నిలదీయగా సర్పంచ్​ భర్త, సదరు పంచాయతీ కార్యదర్శి ఎంబీ బిల్లులు తెచ్చి నిధులను డ్రా చేశారని చెప్పారు. దీంతో సదరు వార్డు సభ్యుడు కంగుతిన్నాడు. బిల్లుల సంగతి ఏమైందని అడిగేందుకు వార్డు సభ్యుడు సర్పంచ్​ ఇంటికి వెళ్లారు. ‘పనులు చేసింది నేను కదా బిల్లులు ఎందుకు డ్రా చేశావు’ అని గట్టిగానే నిలదీశారు. తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్​ భర్త ‘మమ్మల్నే నిలదీస్తావా?’ అని ఇంట్లోకి పిలిచి చితకబాదారు. సర్పంచ్​ నానాదుర్భాషలాడింది. బాధిత వార్డు సభ్యుడు లబోదిబోమని పోలీస్​ స్టేషన్​ లో ఫిర్యాదుచేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగుచూడటంతో మండలంలో సర్వత్రా చర్చనీయాంశమైంది.