Breaking News

సంతోష్‌నగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభం

సంతోష్‌ నగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభం
  • ఒవైసీ జంక్షన్‌ వద్ద రూ.80 కోట్లతో నిర్మాణం
  • లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

సామాజికసారథి, హైదరాబాద్‌: నగరంలోని సంతోష్‌ నగర్‌ ఒవైసీ జంక్షన్‌ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీజే అబ్దుల కలామ్​ఫ్లై ఓవర్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్‌ వే మార్గంగా మిథాని జంక్షన్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వరకు 1.36 కి.మీ.మేర నిర్మించిన ఈ ప్లైఓవర్‌పై ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అత్యంత వాహన రద్దీగల ఎల్‌బీ నగర్‌– ఆరాంఘర్‌ మార్గంలో ఒవైసీ జంక్షన్‌ వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం చేపట్టారు. మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.80 కోట్లు కాగా, ఇందులో రూ.63 కోట్లు ప్లైఓవర్‌ నిర్మాణానికి, మిగిలిన రూ.17కోట్లు భూసేకరణకు ఖర్చుచేశారు. దక్షిణ ప్రాంతంలో ప్రీ క్యాస్ట్‌ టెక్నాలజీతో నిర్మించిన తొలి ప్లైఓవర్‌ ఇదే కావడం విశేషం. ఈ మార్గంలో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండటంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లే మార్గం కూడా కావడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా మార్గం సుగమణమైంది. చార్మినార్‌ జోన్‌ పరిధిలోని సంతోష్‌ నగర్‌ ఒవైసీ జంక్షన్‌, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌ నుంచి జూపార్క్‌ వరకు, బహదూర్‌ పురా ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయ్యాయి. రూ.333 కోట్ల వ్యయంతో నిర్మించిన షేక్‌ పేట్‌ ఫ్లై ఓవర్‌ సుమారు 2.8 కి.మీ.దాకా ఉంది.

మోహదీపట్నం నుంచి ఐటీ ఏరియాకు వేగంగా ట్రాఫిక్‌ వెళ్లేందుకు వీలవుతుంది. ఐటీ ఏరియాలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గించేలా కూకట్‌ పల్లి నుంచి గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్‌ వరకు చేపట్టిన జంక్షన్‌ డెవలప్​మెంట్​ప్రోగ్రామ్‌ లో భాగంగా రెండు అండర్‌ పాస్‌ లు, నాలుగు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వస్తున్నాయి.