- అమ్మవారి కాళ్ల దగ్గర మొండెంలేని తల
- ఉలిక్కిపడిన నల్లగొండ జిల్లావాసులు
- సూర్యపేట జిల్లా పాలకవీడు మండల వాసిగా గుర్తింపు
- భయాందోళనలో చింతపల్లి మండల వాసులు
సామాజికసారథి, నల్లగొండ క్రైం: మొండెం నుంచి వేరుచేసిన తలను గుర్తుతెలియని దుండగులు మైసమ్మ దేవత కాళ్ల వద్ద పెట్టి వెళ్లడంతో నల్లగొండ జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చింతపల్లి మండలం విరాట్ నగర్ గ్రామంలో సోమవారం ఉదయం వెలుగుచూసిన ఈ సంచలన ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్- నాగార్జున సాగర్ రహదారి వెంట ఉన్న గొల్లపల్లి పరిధిలోని విరాట్ నగర్ లో మెట్టు మహంకాళి ఆలయంలో ఒక వ్యక్తిని చంపి, తలను శరీరం నుంచి వేరుచేసి, అమ్మవారికి కాళ్ల వద్ద పెట్టి దుండుగులు వెళ్లిపోయారు. తెల్లవారుజామును వాకింగ్ వెళ్లే వారు మొండెంలేని తలను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి, వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ ఆనంద్ రెడ్డి, సీఐ సత్యం ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తలను అమ్మవారి కాళ్ల వద్ద ఉంచడంతో నరబలి ఇచ్చారా..? లేదా కక్షపూరితంగా ఎక్కడో నరికిచంపి కావాలనే దేవత కాళ్ల వద్ద పెట్టి వెళ్లారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రమావత్ జలేందర్ గా గుర్తింపు?
గొల్లపల్లి విరాట్ నగర్ మహాంకాళి ఆలయంలో ఉన్న మొండెం లేని తల సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపాడు వాసి రమావత్ జలందర్ గా గుర్తించారు. ఆయనకు కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేకపోవడంతో హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో జాయిన్ చేసి చికిత్స అందించారు. డిశ్చార్జి అనంతరం కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. అయినా జలంధర్ మానసిక పరిస్థితి అలాగే ఉండటంతో ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయాడు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మెట్టు మహంకాళి గుడి వద్ద మొండెం లేని తల కనిపించింది. సోషల్ మీడియాలో ఫొటో రావడంతో శూన్యపహాడ్ గ్రామస్తులు చూసి, అది జలంధర్ తలగా గుర్తించారు. గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. జలంధర్ కు ఇద్దరు సోదరులు ఉన్నారు.