- ఇక పెరగనున్న బస్సుచార్జీలు
- ఆర్డినరీ బస్సుల్లో కి.మీ. 0.25 పైసలు
- ఇతర బస్సుల్లో 0.30 పైసలు
- ప్రభుత్వానికి యాజమాన్యం ప్రతిపాదనలు
- చార్జీల పెంపు అనివార్యమైంది: మంత్రి అజయ్
- మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టం
- నష్టాల తగ్గింపునకు మరోమార్గం లేదు:
- ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
సామాజిక సారథి, హైదరాబాద్: అందరూ ఊహించిన విధంగానే ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 0.25 పైసలు, ఇతర బస్సుల్లో 0.30 పైసలు మేర చార్జీలు ప్రభుత్వం పెంచనుంది. ఈ విషయమై ఇదివరకే ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వమే ఫైనల్నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బుధవారం ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో చార్జీల పెంపుపై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోధరలు పెంచడం వల్లే పెంపు అనివార్యమైందన్నారు. కేంద్ర విధానాల వల్లే ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సి వస్తోందన్నారు. కేంద్రం డీజిల్, పెట్రోల్‌పై ధరలు పెంచడంతో ఆర్టీసీపై తీవ్రప్రభావం పడిందన్నారు. ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే ఆర్టీసీకి అంత మేలని ఆయన పేర్కొన్నారు.
బస్సు చార్జీలు ఇలా..
ప్రస్తుతం కిలోమీటర్‌కు కనీస ఛార్జీ రూ.10 నుంచి గరిష్టంగా రూ.35 వరకు ఉంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.10చొప్పున, మెట్రోడీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.15చొప్పున వసూలు చేస్తున్నారు. డీలక్స్ బస్సులకు రూ.20, సూపర్ లగ్జరీ బస్సులకు రూ.25, రాజధాని ఏసీ బస్సులకు రూ.35, గరుడప్లస్ ఏసీ బస్సులకు కిలోమీటర్‌కు రూ.35 వసూలు చేస్తున్నారు.
ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టం
మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లల్లో ఆర్టీసీకి రూ.4,260 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే చార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడింది. ఆర్టీసీకి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.4,882 కోట్లు ఆదాయం రాగా, ఖర్చు రూ.5,811 కోట్లకు చేరింది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.4,592 కోట్లు ఆదాయం రాగా.. ఖర్చు రూ. 5,594 కోట్లకు చేరింది. రూ.1,002 కోట్ల నష్టం నమోదైంది. 2020-21లో నాటికి ఆర్టీసీ ఆదాయం రూ.2,455 కోట్లు ఉంటే ఖర్చు రూ.4,784 కోట్లుగా ఉంది. రూ.2,329 కోట్లు నష్టం వచ్చింది. ఒకవేళ ఛార్జీలు పెంచితే ఆర్టీసీకి ఏడాదికి రూ.850 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. బస్సు చార్జీలు పెరిగితే ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలు ఉన్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్వివరించారు.
ప్రజలు అర్థం చేసుకోవాలి
ఆర్టీసీ చార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకోవాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. లాంగ్ డిస్టన్స్ రూట్లలో బస్సులను నడపడం ద్వారా లాభాలు వస్తాయని సీఎం కేసీఆర్సూచించారన్నారు. 14,00 బస్సులు పూర్తిగా పాడయ్యాయని, వాటి స్థానంలో కొత్త వాటిని కొనాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డినరీ బస్సులకు 0.25 పైసలు, ఇతర బస్సులకు 0.30 పైసలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260 కోట్లు నష్టం వచ్చింది. నష్టాల తగ్గింపునకు టికెట్ ధరల పెంపే మార్గమని చెప్పారు.