- గడపగడపకు బీఎస్పీ కార్యక్రమం
- నాలుగు రోజుల పాటు ఇక్కడే
- నేడు శిరసనగండ్ల నుంచి షురూ
- ఏర్పాట్లు పూర్తిచేసిన పార్టీ శ్రేణులు
సామాజికసారథి, చారకొండ: రాష్ట్రంలో బహుజన సమాజ్పార్టీ మరింత దూకుడు పెంచింది. బహుజనుల రాజ్యాధికార సాధన దిశగా బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్కుమార్అడుగులు వేస్తున్నారు. అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు వారితో మమేకమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి గ్రామానికి వెళ్తున్నారు. అందులో భాగంగానే నాగర్కర్నూల్జిల్లాలో ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడు రోజుల పాటు ఆయన నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించి రాత్రి బస కూడా ఇక్కడే ఉంటుంది. ఈనెల 14న ప్రారంభమయ్యే కార్యక్రమం 17వ తేదీన ముగియనుంది. 8 మండలాల్లో నాలుగు రోజులపాటు పర్యటన సాగనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు నుంచి ఇర్విన్ మీదుగా శిరసనగండ్లకు చేరుకుని అక్కడే ప్రారంభం కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. ప్రతిరోజూ 10 గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు, సభలు ఉంటాయని బీఎస్పీ నాయకులు తెలిపారు.
- సమస్యలపై ఫోకస్
ఈ పర్యటనలో నల్లమల ప్రాంత రైతులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఎస్ ఎల్బీసీ ప్రాజెక్టు ముంపు బాధితులను డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కలవనున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ఇరిగేషన్లో భాగంగా చంద్రసాగర్ను నింపి మూడువేల ఎకరాలకు సాగునీరు అందించే హామీ ఎప్పటినుంచో ఉంది. టీఆర్ఎస్ప్రభుత్వం హామీ ఇచ్చినా ఈ పనులు ముందుకు సాగడం లేదు. ఎత్తులో ఉన్న అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన చెన్నకేశవస్వామి రిజర్వాయర్, ఉమామహేశ్వర రిజర్వాయర్పనులు ప్రతిపాదనలను దాటడం లేదు. వెదురు కలప పుష్కలగా లభిస్తున్న నల్లమల ప్రాంతంలో కాగితపు పరిశ్రమ, జినుకుంటలో లెదర్పార్కును ఏర్పాటుచేసి స్థానికులకు ఉపాధి కల్పించాలనే డిమాండ్ఉంది. అచ్చంపేట మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని పల్కపల్లి, లింగోటం, పులిజాల, నడింపల్లి, లక్ష్మీపూర్, చౌటపల్లి, పోలిశెట్టిపల్లి గ్రామాల ప్రజలు డిమాండ్చేస్తున్నారు. విలీనం చేయబోమని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా ఈ గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఆయా సమస్యలను బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ యాత్రను విజయవంతం చేసే పనిలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని పార్టీ నేతలు తెలిపారు.